
హే మాధవా..!
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
వర్క్‌స్లిప్ ప్రతీ సివిల్ వర్క్ పారదర్శకంగా జరిగేందుకు ఇది బ్లూప్రింట్ లాంటిది. పని అంచనాలు, ఎస్టిమేషన్, డ్రాయింగ్ తదితర కీలక వివరాలు ఇందులో పొందుపరుస్తారు. తరువాత వాటికి ఈఎన్‌సీ నుంచి అనుమతి పొందుతారు. అపుడే టెండర్లు పిలుస్తారు. కానీ... కరీంనగర్ స్మార్ట్‌సిటీ పనుల్లో రోజుకో వింత వెలుగుచూస్తోంది. రూ.కోటి అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన పద్మనగర్ జంక్షన్ పనుల్లో అదనంగా రూ.80 లక్షల వర్క్స్ అదే కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించడంపై సర్వత్రా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పనులకు కనీసం వర్క్‌స్లిప్ కూడా లేదన్న విషయం కలకలం రేపుతోంది. సివిల్ పనుల్లో ఇంత భారీ తప్పిదాలకు ఇంజినీరింగ్‌శాఖ ఎలా అనుమతి ఇచ్చింది? అన్న విషయం చర్చానీయాంశమైంది.
వివాదాస్పద కాంట్రాక్ట్‌దే ఆధిపత్యం..
స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో వేల కోట్ల రూపాయలతో పలుఅభివృద్ధి పనులు చేపట్టడం తెలిసిందే. ఇందులో చాలామటుకు పూర్తయ్యాయి. కొన్ని కొనసాగుతున్నాయి. అభివృద్ధి పనుల్లో అంచనాలు ఇష్టారీతిన భారీగా పెంచారని, అక్రమాలకు పాల్పడ్డారని, పనుల్లోనూ నాణ్యత పాటించలేదని అప్పట్లో ఆరోపణలు, ఫిర్యాదులు రావడం తెలిసిందే. అయితే ఆరోపణలు వచ్చిన అధిక పనులు సదరు కాంట్రాక్టర్ చేయడం ఇక్కడ విశేషం. అతను తలచుకుంటే.. టెండరు లేకుండానే పనులు అతని పరమవుతాయి. బ్లిలులు కూడా నడుచుకుంటూ వస్తాయి.
రూ.లక్షల్లో అంచనా...రూ.కోట్లకు పెంపు
లక్షల రూపాయల్లో అంచనాలుంటే, వాటిని కోట్ల రూపాయలకు పెంచడంలో సదరు కాంట్రాక్టర్ దిట్ట. గతంలో గీతాభవన్ జంక్షన్‌ను రూ.60 నుంచి రూ.70 లక్షల్లో పూర్తి చేయాల్సి ఉండగా, ఆ పనుల ను ఏకంగా రూ.1.30 కోట్ల అంచనాలు పెంచాయ న్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పైగా ఫిర్యాదులున్నా రూ.కోటి బిల్లును ఇప్పటికే తీసుకోవడం గమనార్హం. చివరికి జంక్షన్ పనులకు సంబంధించిన మట్టిని కూడా అమ్ముకున్న ఆరోపణలను సదరు కాంట్రాక్టర్ ఎదుర్కొన్నారు. అంతేకాదు ప్రారంభించిన కొన్నిరోజులు గీతాభవన్ చౌరస్తా వెలుగులు విరజిమ్మింది. ఇపుడు చీకటి అలుముకుంది.
ఒకే కాంట్రాక్టర్‌పై బల్దియాకు అభిమానం
టెండరు లేకుండా పనులు అప్పగింత
కనీసం వర్క్‌స్లిప్ లేకున్నా వర్క్స్ అలాట్
ఐఏఎస్‌ల పర్యవేక్షణ ఉన్నా.. పట్టిపేది?
గాంధీ జంక్షన్‌లో రికవరీ
ఇదే కాంట్రాక్టర్ కార్ఖానగడ్డలోని గాంధీ జంక్షన్ నిర్మాణ పనులు కూడా చేపట్టారు. ఈ పనులకు మించి డబ్బులు తీసుకున్న వైనంపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి అప్పట్లో ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న ప్రస్తుత కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ స్పందించి విచారణ చేపట్టారు. విచారణలో పనికి మించి డబ్బులు తీసుకున్నారని తేలడంతో డబ్బులను సదరు కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయించారు. తప్పు జరిగినట్లు నిర్ధారించి డబ్బులు తిరిగి బల్దియాకు కట్టించుకున్నా.. సదరు కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. ఎందుకంటే ఉన్నతాధికారులకు ఇతను భారీ బహుమతులు ఇచ్చి వశపరుచుకుంటాడన్న విమర్శలు ఉన్నాయి. వీటిని బలపరిచేలా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కరీంనగర్ ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయమై ఈఎన్‌సీ భాస్కర్ రెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన పద్మనగర్ జంక్షన్ మీద మాట్లాడేందుకు సుముఖత వ్యక్తంచేయలేదు. ఇదే విషయమై ఎస్‌ఈ (పీహెచ్) ఎన్‌ఎస్‌రావును సంప్రదించాలని ప్రయత్నించినా.. ఆయన అందుబాటులోకి రాలేదు.

హే మాధవా..!