
స్పోర్ట్స్ స్కూల్ పిలుస్తోంది
● 4వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ● హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్‌లో క్రీడా పాఠశాలలు ● 11 క్రీడలు, 60మంది బాలురు, 60మంది బాలికలకు అవకాశం ● 16 నుంచి మండల, 23 నుంచి జిల్లా, జూలై 1నుంచి రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు
కరీంనగర్ స్పోర్ట్స్: చదువుతో పాటు క్రీడల్లో ఒకేసారి రాణించాలనుకునేవారికి సువర్ణావకాశం. 4వ తరగతి నుంచి క్రీడారంగంలో తర్పీదు పొందేందుకు క్రీడాశాఖ మంచి అవకాశాన్ని కల్పించింది. రాష్ట్రంలో ఉన్న మూడు స్పోర్ట్స్ స్కూళ్లలో 2025–26 ఏడాదిలో 4వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ స్కూల్‌లో చోటు దక్కితే క్రీడల్లో అంతర్జాతీయస్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. స్పోర్ట్స్‌స్కూల్‌లో ప్రవేశాలు.. దరఖాస్తులు.. ఎంపిక ప్రక్రియపై కథనం.
జూన్ 16 నుంచి ప్రవేశ పోటీలు
రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ క్రీడాపాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో 4వ తరగతిలో ప్రవేశాలకు ఎంపిక పోటీల తేదీలను క్రీడాశాఖ అధికారులు ప్రకటించారు. జూన్ 16 నుంచి 19లోపు మండలస్థాయిలో, 23 నుంచి 26వరకు జిల్లాస్థాయిలో, జూలై 1 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రస్థాయిలో ఎంపికపోటీలు జరుగుతాయి. సికింద్రాబాద్‌లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో స్పోర్ట్స్ స్కూళ్లు ఉన్నాయి. విద్యార్థులకు కొన్ని శారీరక, సామర్థ్యానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి, ఎంపికచేస్తారు. ఉత్తమ ప్రతిభ చూపినవారికి 4వ తరగతిలో ప్రవేశం దక్కుతుంది. మొత్తంగా 60మంది బాలురు, 60 మంది బాలికలకు అవకాశం కల్పిస్తారు. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ స్కూళ్లలో 20మంది బాలురు, 20మంది బాలికల చొప్పున అవకాశం కల్పిస్తారు. దొడ్డికాళ్లు, ఫ్లాట్‌ఫీట్, వెన్నుముక వంగి ఉన్నవారు, గుండె సంబంధిత జబ్బులు ఉన్నవారు, బౌ లెగ్స్ ఉన్న వారు, ఎముకలు విరిగినవారు అనర్హులు. ఎంపికై న వారికి అథ్లెటిక్స్, అర్చరీ, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, రోయింగ్, వాలీబాల్, జూడో, ఫెన్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, రెజ్లింగ్ క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో రాణించిన వారికి భవిష్యత్‌లో రైల్వే, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, పోలీస్, బ్యాంక్స్, పోస్టల్ డిపార్ట్‌మెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పీఈటీ, పీడీ, కోచ్‌లు, కార్పొరేట్ సెక్టార్లలో మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
నిర్వహించే ఫిజికల్ టెస్ట్‌లు
మండల, జిల్లాస్థాయిలో ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లైయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల రన్నింగ్, 6.10 మీటర్ల షటిల్ రన్, మెడిసన్ బాల్‌త్రో(కిలో బరువు), వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలీటీ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఎత్తు బరువు, 30 మీటర్ల ఫ్లైయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్‌జంప్, 6.10 మీటర్ల షటిల్‌రన్, స్టాండింగ్ వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, మెడిసన్ బాల్ త్రో(కేజీ), 800 మీటర్ల రన్నింగ్ నిర్వహిస్తారు.
కావాల్సిన ధ్రువపత్రాలు.. అర్హతలు
● ఒరిజినల్ ఆధార్‌కార్డు
● 4వ తరగతి చదువుతున్నట్లు సర్టిఫికెట్
● వయసు ధ్రువీకరణ పత్రం
● 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్టు
● కమ్యూనిటీ సర్టిఫికెట్
● ఐదు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు
● విద్యార్థులు 8 నుంచి 9ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి
● 01– 09– 2016 నుంచి 31–08– 2017 మధ్య పుట్టిన వారు అర్హులు.