
తాత ఉన్నాడా.. అంటూ బంగారం చోరీ
జమ్మికుంట: తాత ఉన్నాడా అంటూ మాటలు కలిపిన ఓ గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ చేసిన సంఘటన బుధవారం జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. టౌన్ సీఐ రవి తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన ఇంజమూరి వెంకటలక్ష్మి ఇంటిముందుకు బుధవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి వచ్చి తాతా ఉన్నాడా అంటూ ఆమె మెడలోని తులం బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి కొడుకు వెంకటసత్యనారాయణస్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ వివరించారు.
వివాహిత ఆత్మహత్య
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని మంగళ్లపల్లికి చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మంగళ్లపల్లికి చెందిన సాసాల లక్ష్మి(50)కి ఇటీవల రెండు సార్లు కిడ్నీలో రాళ్ల కోసం ఆపరేషన్లు జరిగాయి. బుధవారం చిన్న కోడలు సీమంతం గంభీరావుపేటలో జరుగగా కుటుంబసభ్యులు వెళ్లారు. లక్ష్మి మల్లారం శివారులోని ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతికి గల కారణాలు తెలియరాలేదు. మృతురాలికి భర్త అంజయ్య, కుమారులు మహేశ్, బ్రహ్మానందం, కూతురు జ్యోతి ఉన్నారు. వేములవాడ ఎస్సై మారుతి కేసు విచారణ చేపడుతున్నారు.
పుష్కరాల్లో ఆర్టీసీ సిబ్బంది కోసం వైద్య శిబిరం
విద్యానగర్(కరీంనగర్): సరస్వతీ పుష్కరాల విధినిర్వహణలో ఉండే ఆర్టీసీ సిబ్బంది కోసం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు కరీంనగర్ జోనల్ హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏవీ గిరిసింహారావు తెలిపారు. కాళేశ్వరంలోని ప్రత్యేక ప్రయాణ ప్రాంగణంలో ఈవైద్య శిబిరం ఈనెల 15 నుంచి 26 వరకు కొనసాగుతుందని వివరించారు.
ఆర్థికసాయం
శంకరపట్నం: మండలంలోని మొలంగూర్ గ్రామానికి చెందిన వేముల చంద్రబాగ ఇటీవల మృతిచెందారు. బుధవారం ఆమె కుమారుడు శ్రీనివాస్‌కు 2004–05 ఎస్సెస్సీ స్నేహితులు వెంకటేశ్, సద్దాం, సంతోష్ రూ.11వేలు అందించారు.