సూపర్‌ మార్కెట్‌లో చోరీ | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ మార్కెట్‌లో చోరీ

Jun 9 2025 1:00 AM | Updated on Jun 9 2025 1:00 AM

సూపర్

సూపర్‌ మార్కెట్‌లో చోరీ

ఆర్మూర్‌టౌన్‌: పట్టణంలోని సాయి చైతన్య సూపర్‌మార్కెట్‌లో గుర్తుతెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. దుకాణం షెటర్‌ను లేపి లోనికి ప్రవేశించిన దుండగులు దుకాణంలోని వస్తువులతో పాటు సుమారు రూ. 80వేల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలిసింది.

సంతలో సెల్‌ఫోన్లు..

భిక్కనూరు: మండల కేంద్రంలో ఆదివారం జరిగిన వారంతపు సంతలో గుర్తుతెలియని దుండగులు ఐదుగురి సెల్‌ఫోన్లను చోరీచేశారు. దీంతో బాధితులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఒక బాలుడు సెల్‌ఫోన్‌ను ఎత్తుకుని వెళ్తుండగా స్థానికులు అతడివెంటపడ్డారు. కానీ సదరు బాలుడు చిక్కకుండ పారిపోయాడు. గతంలో కూడా సెల్‌ఫోన్ల చోరీలు జరగడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈక్రమంలో సంతలో చోరీల నివారణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

దాబా హోటల్‌లో మందుబాబుల హల్‌చల్‌

ఖలీల్‌వాడి: నగరంలోని సారంగాపూర్‌ కమాన్‌ సమీపంలోని ఓ దాబా హోటల్‌ వద్ద శనివారం అర్ధరాత్రి మందుబాబులు హల్‌చల్‌ చేశారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు బిర్యానీ కావాలని హోటల్‌ నిర్వాహకులతో గొడవకు దిగారు. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని రెండువర్గాలను వెళ్లగొట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

వివాహిత అదృశ్యం

సిరికొండ: మండలంలోని గడ్కోల్‌ గ్రామానికి చెందిన మున్నూరు శోభ అలియాస్‌ సంధ్య అదృశ్యమైనట్లు ఎస్సై రామ్‌ ఆదివారం తెలిపారు. ఈ నెల 7న ఆమె ఎలాంటి కారణం లేకుండానే ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని, ఇప్పటికీ తిరిగిరాలేదన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఆమె భర్త మహిపాల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కామారెడ్డిలో వృద్ధుడు..

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని ఆజాంపూర కాలనీకి చెందిన 65 ఏళ్ల మహమ్మద్‌ యాసిన్‌ఖాన్‌ అనే వృద్ధుడు అదృశ్యమైనట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. ఈనెల 7న ఉదయం అతడు ఇంటి నుంచి తన స్కూటీపై బయటకు వెళ్లిపోయి, ఇప్పటికీ తిరిగిరాలేదు. ఆదివారం ఉదయం పట్టణంలోని కొత్త బస్టాండ్‌ వద్ద స్కూటీ లభ్యమవగా, కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో అతడి కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు సీఐ తెలిపారు. అతడి ఆచూకీ తెలిస్తే పట్టణ పోలీస్‌ స్టేషన్‌లోగానీ, 8712686145, 8712666242 నంబర్లకు సంప్రదించాలన్నారు.

తాడ్వాయిలో వాహనాల తనిఖీ

తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలంలోని కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీ చేశారు. లైసెన్స్‌లు, పొల్యూషన్‌, వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో పాటు సీటు బెల్టులు, హెల్మెట్లు ధరించని వారికి జరిమానా విధించారు. అలాగే పెండింగ్‌లో చాలనులు ఉన్న వాహనాలకు ఆన్‌లైన్‌లో డబ్బులు కట్టేలా చర్యలు తీసుకున్నారు. ఈకార్యక్రమంలో పోలీసు సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.

సూపర్‌ మార్కెట్‌లో చోరీ
1
1/1

సూపర్‌ మార్కెట్‌లో చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement