
ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకోవాలి
గద్వాలటౌన్: ప్రైవేటు పాఠశాలల్లో విద్య వ్యాపారంగా మారిందని, ధనార్జనే ధ్యేయంగా విద్యా సంస్థలు పనిచేస్తున్నాయని, తక్షణమే ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి నర్మద డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి సంవత్సరం కొత్తకొత్త పేర్లతో ప్రైవేటు పాఠశాలలు పుట్టుకొస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ మీడియం చదువులంటూ విచ్చలవిడిగా ఫీజులు పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. చాలా ప్రైవేటు పాఠశాలలో అర్హత లేని వారిని ఉపాధ్యాయులుగా నియమించుకుని పాఠాలు బోధిస్తున్నారని చెప్పారు. విద్యా హక్కు చట్టం అమలు చేసి, ప్రతి పాఠశాలలో 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు కరువయ్యాయని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట్ల విద్యా వలంటీర్లను నియమించాలని కోరారు. సమావేశంలో ఐద్వా నాయకులు వినోద, అమ్ములు, శిరీష, కై రున్ పాల్గొన్నారు.