రౌండ్‌కు రూ.20వేలు

- - Sakshi

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాకేంద్రంతో పాటు సమీప మండలాల్లో రాత్రి పగలు తేడా లేకుండా పేకాట జోరుగా సాగుతోంది. ఒక్కో రౌండ్‌కు రూ.5వేల నుంచి రూ.20వేల వరకు పెట్టి ఆడుతున్నారు. సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారు సైతం పేకాటలో మునిగితేలుతున్నారు. అడవుల్లో, మారుమూల గ్రామాల్లో గుడారాలు ఏర్పాటుచేసుకుని పేకాట ఆడుతున్నారనే విషయం బహిరంగంగా మాట్లాడుకుంటున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. పేకాటలో ఆర్థికంగా నష్టపోతున్న వారి కుటుంబాలు తీవ్ర దీనస్థితిలోకి వెళ్తున్నాయి.

జిల్లాకేంద్రంతో పాటు గణపురం, చిట్యాల, కాటారం, మహాముత్తారం మండలాల్లోని పలు గ్రామాల్లో పేకాటరాయుళ్లు తన ఆటను కొనసాగిస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా ఊరి బయట పంట పొలాల్లో, భూపాలపల్లి చుట్టుపక్కల శివారు అడవుల్లోని చెట్ల పొదల్లో, ఖాళీ ఇళ్లల్లో జూదాన్ని సాగిస్తున్నారు. పేకాట మహమ్మారి గంజాయి, గుడుంబా కంటే ప్రమాదకంగా మారింది. ఆట మాయలో పడ్డ అనేకమంది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి కూలీలుగా మారి దీనస్థితిలోకి వెళ్తున్నారు. గతంలో పలుమార్లు పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు జరిపితే ప్రముఖులు సైతం పట్టుబడగా మందలించి వదిలేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

తనిఖీలు లేవు.. పట్టించుకోరు..

జిల్లాలోని అనేక గ్రామాలలో పేకాట ప్రభావం అధికంగా ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. తనిఖీలు చేయడం లేదు. పలువురు సింగరేణి కార్మికులు పేకాటకు బానిసయ్యారు. యువకులు, విద్యార్థులు సైతం ఆకర్షితులై వారి విలువైన జీవితాలను పాడుచేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అప్పుడప్పుడు పోలీసులు నిర్వహిస్తున్న దాడులకు భయపడి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ అధికారుల రాకను ముందే పసిగట్టే విధానాన్ని కొనసాగిస్తున్నారు. సాయంత్రం అయిందంటే పేకాటరాయుళ్లు ద్విచక్రవాహనాలపై ఇతర ప్రాంతాలకు వెళ్లుతుంటారని, కొన్ని రోజులు ఇతర ప్రాంతాల వారు మండలాలకు వస్తారని ప్రజలు తెలుపుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి పేకాటను నిర్మూలించాలని ప్రజలు కోరుతున్నారు.

రాష్ట్రాలు దాటుతున్న ఆటగాళ్లు..

తెలంగాణలో పేకాట క్లబ్‌లు లేకపోవడంతో పేకాటలో ప్రతిభ కలిగిన వారు రాష్ట్రాలు దాటి క్లబ్‌లకు వెళ్లి ఆడుతున్నారు. క్లబ్‌లలో ప్రత్యేకమైన ఆఫర్లు ఉండటంతో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకొని టీంలుగా మారి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక రాష్ట్రలకు వెళ్లి మరీ ఆడుతున్నారు. రెండు మూడు రోజుల పాటు వెళ్లి పేకాడి కొందరు రెండు, మూడు లక్షల రూపాయలను కోల్పోతున్నారు. దీంతో వారి కుటుంబాలు అప్పల పాలై ఆస్తులు అమ్మడం లేదా తాకట్టు పెట్టి అప్పులు తీరుస్తున్నారు.

ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తాం..

డివిజన్‌ పరిధిలో మండలాల పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ప్రత్యేక తనిఖీలు కూడా నిర్వహించాలని ఆదేశాలు జారీచేస్తాం. పేకాటకు బానిసలై జీవితాలను ఆగం చేసుకోవద్దు. మహమ్మారి పేకాట వలనే అనేకమంది ఆస్తులను పొగొట్టుకొని రోడ్డున పడ్డారు. పేకాట స్థావరాల సమాచారం ఎవరికై నా తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

– రాములు, డీఎస్పీ భూపాలపల్లి

జిల్లాలో జోరుగా పేకాట

రాత్రి పగలు తేడా లేకుండా కొనసాగింపు

జిల్లాకేంద్రంతో పాటు మండలాల్లో కూడా..

పట్టించుకోని పోలీసులు

Read latest Jayashankar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top