
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ భవేష్ మిశ్రా
భూపాలపల్లి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని బుధవారం సాయంత్రం సంబంధిత అధికారులతో కలెక్టర్ చాంబర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రోడ్ల వద్ద ఉన్న, మున్సిపాలిటీ పరిధిలో గల ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రతీ వారం ఒకరు చనిపోతున్నారని చెప్పారు. 2021లో 51 మంది, 2022లో 75మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని అన్నారు. ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్‌లను గుర్తించి అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో 353 జాతీయ రహదారి పరకాల నుంచి కాళేశ్వరం రోడ్డుకు ఇరువైపులా ట్రక్ పార్కింగ్ లేనందున అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అక్కడ ట్రక్ పార్కింగ్ ఏర్పాటు చేసేందుకు పార్కింగ్ స్థలాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు చేసి ప్రతిపాదనలు తయారుచేసి జాతీయ రహదారుల అధికారులకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్పీ సురేందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ భవేష్ మిశ్రా