
భూపాలపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో సైకోగా మారిన ఓ వ్యక్తి తన కుటుంబసభ్యులను చంపుతానని నిత్యం బెదిరించేవాడు. చివరకు అన్నంత పని చేశాడు. పెళ్లి సంబంధం కుదిరిన కూతురిని, భార్యను పైశాచికంగా గొడ్డలితో నరికిచంపిన సంఘటన భూపాలపల్లి పట్టణంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేశాలపల్లికి చెందిన ఎలకంటి ఆగయ్యకు కుమారుడు రమణాచారి ఉన్నాడు. రమణాచారికి 20 ఏళ్ల క్రితం రమ(35)తో వివాహం జరిగింది. వీరికి ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురు చందన(18), కుమారుడు విశ్వ ఉన్నారు. రమణాచారికి అత్తింటి వారు ఇచ్చే వరకట్నం విషయంతో పాటు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయి. దీంతో కొన్ని రోజుల పాటు వేశాలపల్లిని వదిలి పట్టణంలోని క్రిష్ణాకాలనీలో నివాసం ఉన్నారు. అక్కడ వడ్రంగి పని చేసుకుంటూ కుటుంబాన్ని సాకాడు. తిరిగి నాలుగు నెలల క్రితం వేశాలపల్లికి వచ్చి ఉంటున్నాడు. మళ్లీ గొడవలు ప్రారంభమై రమణాచారి సైకోగా మారాడు. మూడు నెలలుగా కుటుంబ సభ్యులను చంపుతానంటూ బెదిరింపులకు గురి చేస్తున్నాడు. నిత్యం గొడవ చేస్తుండటంతో స్థానికులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయినప్పటికీ అతడి వైఖరిలో మార్పు రాలేదు.
మనుమరాలి పెళ్లి చేద్దామనుకున్న తాత..
రమణాచారి పరిస్థితిని గమనించిన నిందితుడి తండ్రి ఆగయ్య ఇటీవలే మనుమరాలు చందనకు వివాహం చేద్దామని నిశ్చయించుకున్నాడు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ సింగరేణి ఉద్యోగితో పెళ్లిచూపులు కూడా పూర్తయ్యాయి. తనకు హనుమకొండలో ఉన్న ఫ్లాట్‌ను అమ్మి వరకట్నం కింద ఇస్తానని ఆగయ్య హామీ ఇచ్చాడు. ఇందుకు అబ్బాయి తరపు వారు అంగీకరించారు. ఈ విషయంలో కూడా రమణాచారికి తన తండ్రికి మధ్య వాగ్వివాదం నెలకొన్నట్లు సమాచారం.
భార్య, కూతురిని గొడ్డలితో నరికి చంపిన భర్త
మూడు నెలల నుంచి చంపుతానని బెదిరింపులు
తప్పించుకున్న కుమారుడు
నిందితుడిని చితకబాదిన స్థానికులు
కాళ్లు మొక్కినా కనికరించలే..
నిందితుడి భార్య రమ బుధవారం వ్యవసాయ పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. ఇంటి పనులు చేసుకుంటున్న క్రమంలో డబ్బులు కావాలని రమణాచారి అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరిగింది. చివరకు డబ్బులు ఇవ్వడంతో బయటకు వెళ్లి మద్యం సేవించి తిరిగి రాత్రి 6.50 గంటలకు ఇంటికి వచ్చాడు. మరలా గొడవ జరుగగా అడ్డువచ్చిన కూతురు చందనను తొలుత గొడ్డలితో నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందగా, భార్య రమ రోదిస్తూ రమణాచారిని బతిమిలాడసాగింది. అయినప్పటికీ వినకుండా భార్య రమను కూడా గొడ్డలితో నరికి చంపాడు. ఇంట్లోనే ఉన్న కుమారుడు విశ్వ వెంటనే బయటకు పరిగెత్తి ‘మా నాన్న... మా అమ్మని, అక్కని నరికి చంపాడు’ అంటూ అరిచాడు. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకోగా నిందితుడు బయటకు వచ్చి ఎవరైనా అడ్డం వస్తే గొడ్డలితో చంపుతానంటూ బెదిరించాడు. చివరకు స్థానికులు అతడిని పట్టుకొని చితకబాది 108లో ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని భూపాలపల్లి డీఎస్పీ రాములు పరిశీలించగా స్థానిక ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.