
శ్రీరామ నవమిని పురస్కరించుకొని కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయం శ్రీరామాలయంలో బుధవారం రాత్రి ఎదుర్కోలు సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రేవెల్లి మమత, సర్పంచ్ వెన్నపురెడ్డి వసంత, ధర్మకర్తలు సమ్మయ్య, రాంరెడ్డి, దేవేందర్, ప్రశాంత్‌రెడ్డి, పద్మ, రాజయ్య పాల్గొన్నారు. – కాళేశ్వరం
నేడు రాములోరి కల్యాణం..
గురువారం జరగనున్న రాములోరి కల్యాణానికి జిల్లావ్యాప్తంగా ఆలయాలు ముస్తాబయ్యాయి. జిల్లా కేంద్రంలో కోదండరామాలయం, శ్రీభక్తాంజనేయస్వామి, రేగొండ మండలం రూపిరెడ్డిపల్లిలోని ఆలయాలు విద్యుత్ కాంతుల్లో వెలుగొందుతున్నాయి. కల్యాణ ఏర్పాట్లను ఆలయ కమిటీలు చేశాయి. భక్తులు హాజరై కల్యాణం వీక్షించేలా పందిర్లు, టెంట్లు ఏర్పాటు చేశారు. – భూపాలపల్లి అర్బన్
శోభాయాత్ర
కాటారం మండల కేంద్రంలోని శ్రీభక్తాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల మొదటి రోజులో భాగంగా పాలపొరక, ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో లక్ష్మణుడు, ఆంజనేయుడు సహిత సీతారాముల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. – కాటారం

