
జీపీల్లో 89.09శాతం పన్నుల వసూలు
● లక్ష్యం రూ.4,00,69,809
● వసూలు చేసింది రూ.3,56,99,955
● నేడు, రేపు మాత్రమే గడువు..
భూపాలపల్లి రూరల్: ఆర్థిక సంవత్సరం మరో రెండు రోజుల్లో ముగియనుండగా గ్రామపంచాయతీలు పన్నుల వసూలు లక్ష్యం దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 89.09శాతం పన్నులు వసూలు చేయగా.. వందశాతం పూర్తిచేసేలా ప్రత్యేక దృష్టి సారించారు. జీపీ ఉద్యోగులు, సిబ్బంది ఉదయం నుంచే రిజిస్టర్లు పట్టుకుని ఇంటింటికీ తిరుగుతున్నారు.
2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లాలో ఆస్తి పన్ను రూ.4,00,69,809 వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు రూ.3,56,99,955 వసూలు(89.09శాతం) చేశారు. ఇంకా రూ.43,69,854 వసూలు చేయాల్సి ఉంది. మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో అధికారులు మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతున్నారు.
అన్ని అనుమతులూ ఆన్‌లైన్‌లోనే..
గ్రామ పంచాయతీల్లో మొదట్లో కేవలం ఇళ్ల అనుమతులకు మాత్రమే ఆన్‌లైన్ సేవలందిస్తూ మిగితా అన్ని రకాల సేవలు ఆఫ్‌లైన్‌లోనే కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుతం జీపీల సేవల్లో పారదర్శకత కోసం అన్ని రకాల అనుమతులు ఆన్‌లైన్ విధానంలోని తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీల్లో పన్నులు, నాన్‌ట్యాక్స్ రూపంలో నిధులు సమకూర్చుకుంటారు. ప్రధానంగా ఇంటి పన్నుల రూపంలో, ఇళ్ల అనుమతులు, జరిమానాలు, సంతల్లో తైబజార్ ద్వారా వచ్చే రాబడులు, వ్యాపార సముదాయాలకు విధించే జరిమానాలు, అనుమతులు తదితర సేవల ద్వారా సమకూరే నిధులను నాన్‌ట్యాక్సు కింద లెక్కిస్తారు. ట్యాక్సు, నాన్‌ట్యాక్సుల ద్వారా మొత్తంరూ.3,56,99,955 వసూలు చేశారు.
కాటారం టాప్.. మొగుళ్లపల్లి లాస్ట్ ..
ఇంటి పన్నుల వసూళ్లలో జిల్లాలో కాటారం మండలం రూ.(97.42)వసూలు చేసి మొదటి స్థానంలో నిలువగా, మొగుళ్లపల్లి (75.83)శాతంతో చివరి స్థానంలో ఉంది. మిగితా మండలాల్లో 84 నుంచి 96 శాతం వరకు పన్నులను వసూలు చేశారు. వసూళ్లలో వెనుకబడిన పంచాయతీలపై అధికారులు ప్రత్యేకదృష్టి సారిస్తున్నారు. రెండు రోజుల్లో ఎలాగైనా వంద శాతం లక్ష్యాలను సాధించాలని కార్యదర్శులకు, సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
పన్నుల వసూళ్ల వివరాలు (శాతంలో)
కాటారం 97.42
భూపాలపల్లి 96.48
రేగొండ 94.82
చిట్యాల 94.48
మల్హర్ 92.46
టేకుమట్ల 88.34
పలిమెల 88.22
మహాముత్తారం 87.05
మహదేవపూర్ 85.14
గణపురం 84.24
మొగుళ్లపల్లి 75.83