
నోటి ద్వారా మంటలు తెప్పిస్తున్న నరేష్
మహదేవపూర్: సైన్స్‌తోనే వ్యక్తిత్వ వికాసం అని భారత నాస్తిక సమాజం రాష్ట్ర నాయకుడు ఉప్పులేటి నరేష్ అన్నారు. మహిమలు బూటకం– సైన్స్ నిజం అనే అంశంపై మండల పరిధిలో బొమ్మపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతున్నా ఇప్పటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు నమ్మడం దురదృష్టకరమని అన్నారు. విద్యార్థి దశలోనే మూఢనమ్మకాలు వీడుతూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. దొంగ స్వాములు, భూత వైద్యులు ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆర్థికంగా సామాజికంగా దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దయ్యాలు, భూతాలు, మంత్రాలు బూటకమకని తెలిపారు. సైన్స్ మ్యాజిక్ షో నిర్వహించిన నరేష్ ఇనుప కత్తిని కడుపులో గుచ్చుకోవడం, విద్యార్థి చేతిపై కిరోసిన్‌తో కాల్చడం, నోట్లో మంటలు లేపడం, గాలిలో విభూది సృష్టించడం, పేపర్లు కాల్చి చాక్లెట్లు చేయడం, విద్యార్థి వాచిని మాయం చేసి రింగు తీసి ఇవ్వడం, లాంటి ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ రమేష్, క్యాంపు కోఆర్డినేటర్ పరశరాములు, అధ్యాపకులు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
