
కారు ఢీకొనడంతో తీవ్రగాయాలైన కూలీలు
పరకాల: కారు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం ఇద్దరు కూలీలను పొట్టనపెట్టుకోగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని చలివాగు వంతెన శివారులో బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన ఏడుగురు కూలీలు అదే గ్రామానికి చెందిన మద్దెబోయిన సందీప్‌కు చెందిన ఆటోలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పోచంపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు మిర్చి తోట ఏరటానికి బుధవారం తెల్లవారుజామున బయలుదేరారు. పరకాల చలివాగు వంతెన సమీపంలోకి రాగానే ఎదురుగా అతివేగంగా దూసుకొచ్చిన కారు ఆటో కుడివైపు ఢీకొని ముళ్లపొదళ్లలో పడిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలంతా ఎగిరిపడి తీవ్ర గాయాలయ్యాయి. కుడివైపు కూర్చున్న కొంగరి చేరాలు(57), దుబాసి కొమల (56)కు తీవ్ర గాయాలు కావడంతో ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరు సిలువే రు కొంరమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వై ద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. తీవ్రగాయాలైన పసుల భిక్షపతి, దుబాసి సూరమ్మ, కొంగరి లక్ష్మీ, సాలికి స్వరూపలు ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు.
పోలీసుల మానవత్వం
రోడ్డు ప్రమాదంలో కూలీలకు తీవ్రగాయాలైన సమాచారం తెలియగానే పరకాల సీఐ పుల్యాల కిషన్, ఎస్సై ప్రశాంత్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని రక్తం మడుగులో ఉన్న కూలీలను ఎత్తుకొని 108లో ఆస్పత్రికి తరలించారు. కాగా బాధితుల ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన మహా రాష్ట్రలోని సిరొంచ మండలం ఆసరవెళ్లి గ్రామానికి చెందిన గుండు తేజపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
దుబాసి కోమల (ఫైల్)
చేరాలు
మృతదేహం
కూలీల ఆటోపైకి దూసుకొచ్చిన కారు
ఇద్దరు కూలీలు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
పరకాల చలివాగు వద్ద ఘటన

