
పోలీసులను అడ్డుకుంటున్న నిరసనకారులు
కేయూ క్యాంపస్: పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని, వెంటనే టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్, ఇతర సభ్యులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కేయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో క్యాంపస్‌లోని లైబ్రరీ ఎదుట నిర్వహించిన మహాధర్నా ఉద్రిక్తతకు చోటు చేసుకుంది. నిరుద్యోగుల సమస్యలపై చర్చించేందుకు కేయూలో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభను నిర్వహిస్తామని కేయూ విద్యార్థి జేఏసీ అనుమతి కోరితే వీసీ ఆచార్య తాటికొండ రమేశ్ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేస్తూ లైబ్రరీ నుంచి పరిపాలనా భవనంవైపు రాగా పోలీసులు భారీ బందోబస్తుతో పరిపాలన భవనం రెండు గేట్లను మూసివేయడంతో రెండో గేటు వైపు ర్యాలీ నిర్వహించారు. రెండో గేటు కూడా మూసివేయడంతో వి ద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు మళ్లీ పరిపాలన భవనం వద్దకు చేరుకుని ధర్నా చేశారు. సంఘర్షణ సభకు అనుమతి ఇవ్వాలని, వెంటనే వీసీ బయటకు రావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. సంఘర్షణ సభకు వీసీ రమేశ్ అనుమతి ఇస్తే మేము శాంతియుతంగా వెళ్లి పోతామని విద్యార్థి జేఏసీ నాయకులు పోలీసులను కోరారు. అయినా వీసీ రాకపోవడంతో పరిపాలనా భవనంలోకి చొచ్చుకెళ్లే యత్నం చేశారు. అప్పటికే ప్రధాన ద్వారం వద్ద మోహరించి ఉన్న పోలీసులు వీరిని అడ్డుకోవడంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ప్రధాన ద్వారం వద్ద పలు అద్దాలు పగిలిపోయాయి. దీంతో పోలీసులు విద్యార్థి నాయకులపై లాఠీచార్జ్ చేశారు. దీంతో విద్యార్థినాయకులు కొన్ని పూలకుండీలను పగులగొట్టారు. మరోవైపు ఇద్దరు విద్యార్థి నాయకులు పరిపాలన భవనం ఎక్కి తమ నిరసన తెలిపారు. అక్కడి నుంచి దూకుతారని భావించిన పోలీసులు వారిని కిందకు దించివేశారు. మరికొందరు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసే యత్నం చేయగా పోలీసులు లాక్కునే యత్నం చేయడంతో విద్యార్థి నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో విద్యార్థి నాయకుడు మేడ రంజిత్ తలకు గాయం అయింది. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
క్రిమినల్ కేసులు నమోదు చేయాలి:
కేయూ విద్యార్థి జేఏసీ
రాష్ట్రంలోని 35 లక్షల నిరుద్యోగుల భవిష్యత్‌ను అంగట్లో పెట్టారని కేయూ విద్యార్థి జేఏసీ నాయకులు మండిపడ్డారు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్, ఇతర సభ్యులను బర్తరఫ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కోచింగ్ సెంటర్లలో వేల రూపాయలు పెట్టి ప్రిపేర్ అయితే గ్రూప్ 1, తదితర పేపర్ల లీకేజీలతో వారి ఆశలు అడియాశలయ్యాయన్నారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో ఢిల్లీలో ఈడీ విచారణను ఎదుర్కొంటుంటే ప్రజలను, నిరుద్యోగులను గాలికి వదిలేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీ లో తిష్ట వేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కేయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ ఇట్టబోయిన తిరుపతియాదవ్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి విజయ్‌ఖన్నా, కోశాధికారి మొగిలి వెంకటరెడ్డి, గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు రాజునాయక్, టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్, ఏబీఎస్‌ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మంద నరేష్, ఎన్‌ఎస్‌యూఐ బాధ్యులు అలువాల కార్తీక్, రాకేష్, కృష్ణ, బీఎస్‌ఎఫ్ కేయూ ఇన్‌చార్జ్ బొట్ల మనోహర్, కళ్లేపెల్లి ప్రశాంత్, కామగోని శ్రవణ్, వంశీకృష్ణ, బి నర్సింహారావు, బీసీ విద్యార్థి సంఘం కేయూ ఇన్‌చార్జ్ ఆరెగంటి నాగరాజు, జేఏసీ నాయకులు రంజిత్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
13మందిపై కేసు
వీసీ ఆచార్య రమేశ్ ఫిర్యాదు మేరకు 13 మంది విద్యార్థి సంఘం నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ విద్యార్థి నాయకులను పరామర్శించారు.
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత
మహాధర్నా ర్యాలీ, పేపర్ లీకేజీపై ఆగ్రహం
సంఘర్షణ సభకు అనుమతి ఇవ్వకపోవడంతో పరిపాలనా భవనంలోకి చొచ్చుకెళ్లేయత్నం
పోలీసుల లాఠీచార్జ్, విద్యార్థి నాయకుడి
తలకు గాయం
విద్యార్థి జేఏసీ నాయకుల అరెస్ట్, కేసు నమోదు
ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్న వీసీ రమేశ్
సంఘర్షణ సభకు అనుమతి ఇవ్వకుండా వీసీ ఆచార్య రమేశ్ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికై న 30 లక్షల మంది నిరుద్యోగుల నియామకాలపై నమ్మకం కలగాలంటే టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్, సభ్యులను బర్తరఫ్ చేయాలి. పేపర్ లీకేజీని సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి.
–తిరుపతి యాదవ్, కేయూ విద్యార్థి జాక్ చైర్మన్
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం..
ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. పేపల్ లీకేజీపై టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్, కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. సంఘర్షణ సభకు వీసీ అనుమతి ఇవ్వకపోవడం శోచనీయం.
–మేడ రంజిత్, టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నేడు కేయూ బంద్‌కు పిలుపు
విద్యార్థి నాయకులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ నేడు (గురువారం) కేయూ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఏబీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేశ్ తెలిపారు. విద్యార్థినాయకుల అరెస్ట్‌ను నిరసిస్తూ కేయూలో నిరసన తెలిపారు.

ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు, విద్యార్థులు

పూలకుండీ పగులగొడుతున్న విద్యార్థి

