
వీసీలో మాట్లాడుతున్న కలెక్టర్ శివలింగయ్య
జనగామ: పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన, ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణపై దృష్టి సారించాలని, విద్యార్థుల కోసం ఉదయం, మధ్యాహ్నం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడిపించాలని చెప్పారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి కలెక్టర్ శివలింగ య్య జిల్లాలో ఏర్పాట్లపై వివరించారు. 6,748 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. 42 సెంటర్లు ఏర్పాటు చేశామని, ఆమా సెంటర్లలో అవసరమైన సదుపాయాలు, సీసీ కెమెరాలు, విద్యుత్ తదితర వాటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి 6304062768 నంబర్‌ను విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. వీసీలో డీఈఓ రాము, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాదవ్, డీపీఓ పార్ధసారధి, మున్సిపల్ కమిషనర్ రజిత, ఆర్టీఓ శ్రీనివాస్, బి.అర్జున్, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.
వీసీలో విద్యాశాఖ మంత్రి
సబితా ఇంద్రారెడ్డి