
జనగామ రూరల్: విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అవకాశం కల్పిస్తున్నది. పాఠశాల విద్యార్థులకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం (యువ విజ్ఞాన కార్యక్రమం) నిర్వహిస్తున్నది. అంతరిక్ష శాస్త్రంలో అభివృద్ధి చెందుతున్న ధోరణులు, స్పేస్‌పై ప్రాథమిక జ్ఞానం అందించడానికి కృషి చేస్తున్నది. ఇందుకు ప్రస్తుత విద్యాసంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి శిక్షణ కు దరఖాస్తులు ఆహ్వానించింది. శిక్షణకు ఎంపికై న విద్యార్థులకు రవాణా చార్జీలు, భోజన వసతులు, ఇతర అన్ని సదుపాయాలు కల్పించనుంది.
ఎంపిక ప్రక్రియ ఇలా..
8వ తరగతిలో పొందిన మార్కులకు 50 శాతం, ఆన్‌లైన్ క్విజ్‌లో 10 శాతం, సైన్స్‌ఫెయిర్‌లో పాల్గొంటే 10శాతం, ఒలింపియాడ్‌లో ర్యాంక్‌కు 5 శాతం, క్రీడా పోటీలకు 5 శాతం, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌కి 5 శాతం, గ్రామపంచాయతీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 15 శాతం వెయిటేజీతో ఎంపిక ఉంటుంది.
12 రోజుల శిక్షణ
ఎంపికైన విద్యార్థులకు వేసవి సెలవుల్లో మే 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. విద్యార్థి, తల్లిదండ్రులు, గైడ్ టీచర్‌కు కూడా ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. అయితే దరఖాస్తును పలు దశల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదట ఈ మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకొని 48 గంట ల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ క్విజ్‌లో పాల్గొనాలి. ఇది పూర్తయిన 60 నిమిషాల్లో యువికా(యువ విజ్ఞాన కార్యక్రమం) పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. అలాగే విద్యార్థి సంతకం, గత మూడెళ్లలో సాధించిన ప్రగతి రిపోర్ట్ పత్రాలు అప్‌లోడ్ చేయాలి.
ఏప్రిల్ 3 వరకు గడువు..
ఆసక్తి ఉన్న విద్యార్థులు ఏప్రిల్ 3వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. 9వ తేదీ ప్రక్రియ పూర్తి చేసి 10న మొదటి విడత జాబితా ప్రకటించి ఎంపికైన వారికి సమాచారం ఇస్తారు. రెండో విడత 20వ తేదీన ఉంటుంది. మే 14న ఆయా సెంటర్లకు విద్యార్థులు చేరుకుంటారు.
విద్యార్థులకు ‘ఇస్రో’ అవకాశం
తొమ్మిదో తరగతి విద్యార్థులు అర్హులు
క్విజ్, 8వ తరగతి మార్కులే ఆధారం..
ఎంపికైన వారికి
12 రోజుల పాటు ఉచిత శిక్షణ
ఏప్రిల్ మూడో తేదీ వరకు గడువు
శిక్షణ కేంద్రాలు
ఇస్రో ఆధ్వర్యంలో 12 రోజులు శిక్షణ ఇవ్వడానికి దేశ వ్యాప్తంగా ఏడు సెంటర్లు కేటాయించారు. అందులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ డెహ్రాడూన్, విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ తిరువనంతపురం, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట, యూఆర్.రావు శాటిలైట్ సెంటర్ బెంగళూరు, స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ హైదరాబాద్, నార్త్ ఈస్ట్ స్పేస్ సెంటర్ షిల్లాంగ్ ఉన్నాయి.