
పల్లె ముంగిట వైద్య సేవలు
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ● ఆరవెల్లిలో పల్లె దవాఖానా ప్రారంభం
పెగడపల్లి: పల్లె దవాఖానాలతో ప్రజల ముంగిటకు వైద్య సేవలు తీసుకొచ్చామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండలంలోని ఆరవెల్లి గ్రామంలో కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి ఆయూష్మాన్ భారత్ పల్లె దవాఖానా నూతన భవనాన్ని శనివారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ వైద్యరంగాన్ని పటిష్టం చేసేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ చేపడుతున్నామని, మందుల కొరత లేకుడా చూస్తున్నామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10లక్షలకు పెంచామన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం మద్దులపల్లికి చెందిన దివ్యాంగుడు మనోజ్‌కుమార్‌కు స్కూటీ అందించారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీడబ్ల్యూఓ నరేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.