Russia Ukraine War: ఉక్రెయిన్‌కు అంత సత్తా ఎక్కడిది?

Why Ukraine Has Been Able To Stall Russian Troops Till Now - Sakshi

రష్యాను ఎదుర్కొని ఉక్రెయిన్‌ దీటుగా ఎలా నిలబడింది? 

స్థానబలం, స్థానికుల బలగంతో ఉక్రెయిన్‌ ఎదురుదాడి  

పశ్చిమ దేశాల నుంచి ఆయుధాల వెల్లువ 

ఎనిమిదేళ్లుగా వ్యూహాత్మక సన్నద్ధత 

ఉక్రెయిన్‌ను తక్కువ అంచనా వేసిన రష్యా

ఉక్రెయిన్‌పై రష్యా దాడి అంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రమేనని అందరూ అనుకున్నారు. ఏదో నాలుగైదు రోజుల్లో ఉక్రెయిన్‌ని రష్యా స్వాధీనం చేసుకుంటుందని అంచనాలు కట్టారు. కానీ అందరి లెక్కలు తప్పాయి. రెండు వారాలైనా ఉక్రెయిన్‌ దండు రష్యా దండయాత్రని సమర్థంగా అడ్డుకుంటోంది. నాటో తన బలగాలు దింపకపోయినా, నో–ఫ్లై జోన్‌ని ప్రకటించడానికి నిరాకరించినా ఉక్రెయిన్‌ పోరాటాన్ని ఆపలేదు. చావో రేవోకి సిద్ధమై యుద్ధం చేస్తోంది. యుద్ధంలో ఉక్రెయిన్‌ ఈ స్థాయి పోరాటపటిమను ఎలా చూపిస్తోంది? ఉక్రెయిన్‌కి కలిసొచ్చే అంశాలేమిటి? రష్యా చేసిన తప్పిదాలేంటి?  

సన్నద్ధత 
పశ్చిమ దేశాల సహకారంతో ఉక్రెయిన్‌ తన ఆయుధ సంపత్తిని పెంచుకుంది. రష్యా 2014లో క్రిమియాను ఆక్రమించుకున్న దగ్గర్నుంచి ఉక్రెయిన్‌ ఆత్మ రక్షణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి నాటో సైనికులతో శిక్షణనిచ్చింది. ‘ఏ క్షణంలో రష్యా దాడికి దిగినా ఎదుర్కోవడానికి 8ఏళ్లుగా ఉక్రెయిన్‌ ప్రణాళికలు రచిస్తోంది. ఆయుధాల పెంపు, బలగాలకు శిక్షణ, వ్యూహరచన వంటి అంశాల్లో బలంగా నిలిచింది’అని జార్జ్‌టౌన్‌ వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డౌగ్లస్‌ చెప్పారు.  

స్థానబలం 
స్థానబలానికి మించిన బలం ఏదీ లేదంటారు. సరిగ్గా ఇక్కడే రష్యా ఉక్రెయిన్‌ని తక్కువ అంచనా వేసింది. సోవియెట్‌ యూనియన్‌గా ఉన్న రోజుల్లో ఉక్రెయిన్‌ భౌగోళిక పరిస్థితుల్ని అంచనా వేసుకుందే తప్ప, ఇన్నేళ్లలో ఆ ప్రాంతం ఎంత మారిపోయిందో, స్థానికంగా ఉక్రెయిన్‌ బలగాల ప్రాబల్యం ఎలా పెరిగిందో తెలుసుకోలేకపోయింది. ప్రజలే ఆయుధాలు చేతపట్టి తిరుగుబాటు చేస్తారని గ్రహించుకోలేక ఇప్పుడు కదన రంగంలో గట్టి ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. పట్టణ ప్రాంతాల రూపురేఖలు మారిపోవడంతో ఉక్రెయిన్‌ బలగాలు ఎటు నుంచి వచ్చి మీద పడతాయో తెలుసుకోలేక రాజధాని కీవ్‌ను పదిహేను రోజులైనా స్వాధీనం చేసుకోలేకపోతోంది. ‘ఉక్రెయిన్‌లో మార్పుల్ని అంచనా వేయడంలో రష్యా విఫలమైంది. వీధి వీధిలోనూ, ప్రతీ భవంతిలోనూ అన్నిచోట్లా రష్యా బలగాలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి’అని కాలేజీ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సెక్యూరిటీ అఫైర్స్‌ ప్రొఫెసర్‌ స్పెన్సర్‌ మెరెదిత్‌ చెప్పారు.  

సంఘీభావం 
పౌర నివాసాలు, పాఠశాలలు, ఆస్పత్రుల్ని లక్ష్యం గా చేసుకొని రష్యా బలగాలు దాడి చేస్తూ ఉండడంతో ఉక్రెయిన్‌ ప్రజలతో ప్రపంచదేశాల్లో రష్యా పై ఒక కసి పెరిగింది. ప్రాణాల మీదకొస్తున్నా అధ్యక్షుడు జెలెన్‌స్కీ లెక్కచేయకుండా కీవ్‌లో ఉంటూ అందరిలోనూ పోరాట స్ఫూర్తిని రగిలించారు. దీంతో ప్రజలంతా స్వచ్ఛందంగా ఆయుధాలు చేతపూని ఎదురుదాడికి దిగారు. రష్యా భీకరమైన దాడులకు ఎదురుదాడికి దిగడం తప్ప ఉక్రెయిన్‌కు మరో మార్గం లేదని రిటైర్డ్‌ ఫ్రెంచ్‌ కల్పనర్‌ మైఖేల్‌ గోయా అభిప్రాయపడ్డారు.

ఆయుధాలే ఆయుధాలు 
రష్యా దాడి మొదలు పెట్టిన తర్వాత నాటో బలగాలు నేరుగా మద్దతు ఇవ్వకపోయినా ఆయుధాలను లెక్కకు మించి సరఫరా చేస్తున్నాయి. నాటోలో సభ్యత్వం లేకపోయినప్పటికీ స్వీడన్, ఫిన్‌లాండ్‌ సహా 20కిపైగా దేశాలు వేల సంఖ్యలో యుద్ధట్యాంక్‌ విధ్వంసక ఆయుధాలను పంపించాయి. దాడి మొదలయ్యాక రోజుకో కొత్త రకం ఆయుధాలు ఉక్రెయిన్‌కు అందుతున్నాయి. 2,000కు పైగా స్ట్రింగర్‌ మిస్పైల్‌ (మ్యానన్‌ పోర్టబుల్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌), 17 వేలకు పైగా యుద్ధ ట్యాంక్‌ విధ్వంసక తేలికపాటి ఆయుధాలు, 2,000 యుద్ధట్యాంక్‌ విధ్వంసక క్షిపణులను పశ్చిమ దేశాలు సరఫరా చేశాయి. గ్రనేడ్లు, రాకెట్లు, ఇతర ఆయుధాలు భారీ సంఖ్య లో ఉన్నాయి. ఉక్రెయిన్‌లో ప్రతీ ఒక్కరి చేతిలో ఆయుధం ఉందంటే అతిశయోక్తి కాదేమో.  

రష్యా తప్పిదాలు
ఉక్రెయిన్‌ని కొట్టడం ఏమంత పెద్ద పని కాదని రష్యా తేలిగ్గా తీసుకుంది. ఎక్కువగా బలగాలను మోహరించలేదు. మూడు రోజుల్లో రాజధాని కీవ్‌ వశమైపోతుందని భావించడం రష్యా వ్యూహాత్మక తప్పిదమని అమెరికాలోని రష్యా స్టడీస్‌ ప్రోగ్రామ్‌ ఎట్‌ ది సెంటర్‌ ఫర్‌ నేవల్‌ అనాలిసస్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ కోఫ్‌మన్‌ పేర్కొన్నారు. ఆ తర్వాత ఎన్ని బలగాలను మోహరించినప్పటికీ ఈలోగా ఉక్రెయిన్‌ చేతుల్లోకి ఆయుధాలు వచ్చి చేరాయి.  

నైతిక స్థైర్యం
రష్యా సైన్యానికి ఊహించని నష్టం జరగడంతో సైనికులు నైతిక స్థైర్యం తగ్గిపోయింది. యుద్ధభూమిలో వేల సంఖ్యలో మరణాలు, క్షతగాత్రులతో పాటు చాలామందికి తాము యుద్ధానికి వెళుతున్నామన్న విషయం తెలీదు. పుతిన్‌ ప్రభుత్వం సైనికులకు అసలు విషయం చెప్పకుండా దాచి కదనరంగానికి పంపడం తప్పిదేమనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
–సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top