మరో గుర్తుతెలియని వస్తువును కూల్చేసిన అమెరికా.. వారంలో నాలుగోది!

US Shoots Down Another Flying Object Fourth Strike In A Week - Sakshi

వాషింగ్టన్‌: గగనతలంలో ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువులు అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారాయి. గత వారం రోజులుగా అగ్రరాజ్యంలో వరుస గగనతల ఉల్లంఘన ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆకాశంలో 20 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఓ వస్తువును అమెరికా కూల్చేసింది. మిచిగాన్‌ రాష్ట్రంలోని హురాన్‌ సరస్సుపై ఎగురుతున్న అనుమానస్పద వస్తువును యూఎస్‌ యుద్ద విమానం పేల్చేసింది. గతం వారం రోజుల్లో వింత వస్తువులను కూల్చేయడం ఇదే నాలుగోసారి.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశాల మేరకు ఈ వస్తువును పేల్చేశారు. ఎఫ్‌-16 యుద్ద విమానంతో కూల్చివేయాలని బైడెన్‌ ఆదేశించినట్లు సీనియర్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారి ఒకరు తెలిపారు. తాజాగా గుర్తించిన వస్తువు అష్టభుజి ఆకారంలో తీగలు వేలాడుతూ కనిపించిందని అమెరికా తెలిపింది. ఇది ప్రమాదకరం కాదని, దాని వల్ల ఎలాంటి నష్టంలేదని అమెరికా తెలిపింది. నిఘా సామర్థ్యం, సైనిక ముప్పు కలిగించే శక్తి లేదని నిర్ధారించింది.

అయితే ఇది సుమారు 20 వేల అడుగుల ఎత్తులో మిచిగాన్‌ మీదుగా ఎగురుతుండటం వల్ల పౌర విమానాల రాకపోకలకు విఘాతం కలుగుతుందన్న అనుమానంతో ఈ వస్తువును కూల్చేసినట్లు పేర్కొంది. కాగా ఫిబ్రవరి 4న చైనాకు భారీ బెలూన్‌ను అమెరికా కూల్చేసిన విషయం తెలిసిందే. దీని వెనక చైనా గూఢచర్యం ఉందని ఆరోపించింది. ఈ ఆరోపణను డ్రాగన్‌ దేశం కొట్టివేసింది.

అది వాతావరణాన్ని పరిశీలించే బెలూన్ మాత్రమేననీ.. దారి తప్పి అమెరికా ఆకాశంలోకి వచ్చిందని చెప్పింది. ఈ వాదనను అమెరికా ఖండించింది. అనంతరం అలాస్కా తీరంలో కారు పరిమాణంలో అత్యంత ఎత్తులో ఎగురుతున్న ఒక వస్తువును కూల్చేశామని శుక్రవారం అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ తెలిపింది. తరువాత శనివారం కెనడాలోని యూకాన్‌ ప్రాంతంలో.. ఇప్పుడు మిచిగాన్‌లో మరో వస్తువును పేల్చేశారు.

అయితే, ఈ మూడు వస్తువులు ఏంటీ? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నదానిపై ఇంతవరకూ ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం అమెరికా మిలిటరీ ఆ వస్తువుల శకలాలను స్వాధీనం చేసుకునే పనిలో ఉంది. తాజా పరిణామాలతో ఆందోళన చెందిన అమెరికన్లు.. ఇంకా ఎన్ని ఎగురుతాయోనని నిత్యం ఆకాశం వైపు చూస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top