రష్యాలోని కమ్చట్కా ప్రాంతాన్ని మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. గురువారం రాత్రి రిక్టర్ స్కేల్పై 7 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. గత ఏడాది ఇదే ప్రాంతంలో సంభవించిన 8.8 తీవ్రత భూకంపం.. ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ఈ ప్రాంతంలో తరచూ శక్తివంతమైన భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? భూమి లోపల ఏం జరుగుతోంది? అనే చర్చకు దారి తీసింది.
కమ్చట్కా ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం అంచున ఉంది. 2025 జూలై 30న ఈ తీరానికి సమీపంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో పసిఫిక్ మహాసముద్రం పరిధిలోని పలు దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ తర్వాత కూడా అనేక ప్రకంపనలు నమోదయ్యాయి. తాజా భూకంపంతో మరోసారి తీర దేశాలు ఉలిక్కిపడ్డాయి. అయితే ఈసారి సునామీ హెచ్చరికలు మాత్రం జారీ చేయలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఒక భూఫలకం మరో భూఫలకం కిందకు నెమ్మదిగా చొచ్చుకుపోతోంది. ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు ‘సబ్డక్షన్’గా పిలుస్తారు. పసిఫిక్ భూఫలకం ఏడాదికి సుమారు 8 సెంటీమీటర్ల మేర కదులుతుంది. ఈ కదలిక మనకు కనిపించకపోయినా, దశాబ్దాల పాటు కొనసాగినప్పుడు భూఫలకాల మధ్య విపరీతమైన ఒత్తిడి పేరుకుపోతుంది.
భూఫలకాల మధ్య ఉండే ఘర్షణ కారణంగా అవి కొన్ని చోట్ల ఇరుక్కుపోతాయి. ఒత్తిడి పెరిగి శిలలు తట్టుకోలేని స్థాయికి చేరినప్పుడు ఒక్కసారిగా భూమి పొరలు జారిపోతాయి. అప్పుడు విడుదలయ్యే శక్తి భూకంప తరంగాలుగా వ్యాపించి ప్రకంపనలకు కారణమవుతుంది. కమ్చట్కా ప్రాంతంలో తరచూ బలమైన భూకంపాలు రావడానికి ఇదే ప్రధాన కారణం.
రింగ్ ఆఫ్ ఫైర్లో కీలక ప్రాంతం
పసిఫిక్ మహాసముద్రం చుట్టూ విస్తరించిన సుమారు 40 వేల కిలోమీటర్ల భూకంప, అగ్నిపర్వత మండలాన్ని ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ అంటారు. ప్రపంచంలో అత్యధిక భూకంపాలు, చురుకైన అగ్నిపర్వతాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. భూఫలకాలు ఒకదాని కిందకు మరొకటి చొచ్చుకుపోవడంతో భూమి లోపల శిలాద్రవం ఏర్పడటానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఫలితంగా కమ్చట్కాలో భూకంపాలతో పాటు అగ్నిపర్వత కార్యకలాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
తాజా భూకంపంతో..
తాజాగా సంభవించిన 7 తీవ్రత భూకంపం సుమారు 140 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు సమాచారం. గత ఏడాది సంభవించిన భారీ భూకంపం సముద్ర తీరానికి సమీపంలోని భూఫలకాల సరిహద్దులో ఏర్పడగా, తాజా భూకంపం అంత లోతులో సంభవించడం గమనార్హం. ఇది భూమి లోపలికి చొచ్చుకుపోతున్న పసిఫిక్ భూఫలకం లోపల ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఒక భారీ భూకంపం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒత్తిడిని మార్చి మరిన్ని ప్రకంపనలకు కారణం కావొచ్చు.
మరో భారీ భూకంపం?
వరుస భూకంపాల నేపథ్యంలో.. కమ్చట్కాను మరోసారి భారీ భూకంపం కుదిపేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భూకంపం సంభవిస్తుందా? వస్తే ఎంత తీవ్రతతో ఉంటుంది అనే విషయాలను కచ్చితంగా.. ముందుగానే చెప్పడం సాధ్యం కాదని భూగర్భ శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే కమ్చట్కాలో తరచూ వస్తున్న భారీ ప్రకంపనల వెనుక కారణం భూమి లోపల నిరంతరం కదులుతున్న భూఫలకాలే. ఈ కదలికలు ఆగనంతకాలం ఈ ప్రాంతం భూకంప ముప్పు ఉన్న ప్రాంతంగానే కొనసాగుతుందని మాత్రం చెబుతున్నారు.
ఇదీ చదవండి: పశ్చిమాసియా రాజకీయాల్లో ముగిసిన ఓ శకం


