శశి థరూర్‌... ఈసారి ఫ్రెంచ్‌లో! | provides a safe haven,Shashi Tharoor speaks in French to lecture Russia | Sakshi
Sakshi News home page

శశి థరూర్‌... ఈసారి ఫ్రెంచ్‌లో!

Jun 25 2025 7:46 PM | Updated on Jun 25 2025 8:24 PM

provides a safe haven,Shashi Tharoor speaks in French to lecture Russia

కీవ్‌:  తిరువనంతపురం కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ ఇంగ్లీషు భాషా ప్రావీణ్యం గురించి కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదు కానీ.. ఆయన ఫ్రెంచ్‌లోనూ అదరగొట్టగలరని మాత్రం తాజాగా స్పష్టమైంది. అది కూడా రష్యా దౌత్యవేత్తతో మాట్లాడుతూ! విషయం ఏమిటంటే...

పహల్గామ్‌ దాడి తరువాత దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’ గురించి ప్రపంచదేశాలకు వివరించే పార్లమెంటరీ బృందానికి శశి థరూర్‌ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బృందం ప్రస్తుతం మాస్కోలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా రష్యాలోని లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్షుడు లియోనిడ్‌ స్లట్‌స్కీతో థరూర్‌ బృందం సమావేశమైంది. భారత్‌ హస్తకళల వైభవాన్ని చాటే ఒక జ్ఞాపికను రష్యా దౌత్యవేత్తకు అందించిన థరూర్‌.. ప్రతిగా ఆయన అందించిన అరుదైన పెన్నును స్వీకరించారు.

‘‘రాతగాడికి పెన్ను బహుమానంగా ఇవ్వడం సంతోషాన్నిచ్చింది’’ అని వ్యాఖ్యానించారు. ఆ తరువాత ఇరువురి మధ్య చర్చలు ఉగ్రవాదం.. నివారణ చర్యలు.. రషా​ ఏం చేస్తోందన్న అంశాలపైకి మళ్లింది.. ఈ సందర్భంగా లియోనిడ్‌ స్లట్‌స్కీ మాట్లాడుతూ.. ‘‘రష్యా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో బహుముఖ వ్యూహం అనుసరిస్తోంది. ఇందులో భాగంగా ఏటా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఆరుసార్లు ఈ సమావేశాలు జరిగాయి. వచ్చే ఏడాది ఏడో సమావేశం నిర్వహిస్తున్నాం. పాకిస్థాన్‌తోపాటు ఇతర దేశాలను ఆహ్వానిస్తున్నాం’’ అని అన్నారు.

పాకిస్థాన్‌ పేరు వినపడగానే స్పందించిన శశిథరూర్‌ భారత దౌత్యవేత్తల అంతర్జాతీయతను గుర్తు చేసేలా ఫ్రెంచ్‌లో స్లట్‌స్కీకి సమాధానమిచ్చారు. ‘‘పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిచ్చే దేశం’’ అని గుర్తు చేశారు. తద్వారా రష్యాతోపాటు యూరోపియన్‌ దేశాల దౌత్యవేత్తలకు భారత్‌ ఉద్దేశాలను స్పష్టం చేసినట్టు అయ్యింది. అయితే థరూర్‌ వ్యాఖ్యలను విన్న స్లట్‌స్కీ పాకిస్థాన్‌ను ఆహ్వానించడాన్ని సమర్థించుకున్నారు.అది వేరే విషయం!

 

Advertisement
 
Advertisement
Advertisement