Oxfam Report : ఆ ‘వైరస్’ తో నిమిషానికి 11 మంది మృతి

Oxfam Report Revealed That Hunger Crisis Killing 11 People Every Minute - Sakshi

వెబ్‌డెస్క్‌: ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కరోనా. అయితే కరోనాను మించిన మరో మహమ్మారి చాప కింద నీరులా భూమ్మీద దేశాలను పట్టి పీడిస్తోంది. కరోనాను మించిన మరణాలు ఈ మహమ్మారి కాటుకు గురవుతున్నాయి. కరోనాను మించిన ఆ భయంకర వైరస్‌ పేరు ఆకలి. అవును ఆక్స్‌ ఫాం అనే సంస్థ తాజాగా చేపట్టిన సర్వేలు ఆకలి చావులు పెరిగినట్టు తేలింది. 

ఆకలిరాజ్యం
పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ఆక్స్ ఫాం అనే సంస్థ ఆకలి వైరస్ ఎక్కువైంది పేరిట విడుదల చేసిన నివేదిక సంచలనంగా మారింది. ఈ నివేదిక ప్రకారం ఈ భూమ్మిదీ నిమిషానికి 11 మంది ఆకలికి తట్టుకోలేక, తినడానికి తిండి లేక చనిపోతున్నారని తేలింది.

కరోనాను మించి
ఇవ్వాళ ‘ద హంగర్ వైరస్ మల్టిప్లైస్ (ఆకలి వైరస్ అధికమైంది)’ పేరిట విడుదల చేసిన ఆ నివేదికలో ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఏడుగురు చనిపోతుంటే.. ఆకలితో 11 మంది ఊపిరి వదులుతున్నారని పేర్కొంది.  ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభంలో 15.5 కోట్ల మంది చిక్కుకున్నారని వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 2 కోట్ల మంది ఎక్కువగా ఆకలి బారిన పడ్డారని తెలిపింది. 

సైనిక సంక్షోభం
ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారిలో 66 శాతం మంది సైనిక సంక్షోభంలో చిక్కుకున్న దేశంలోని వారేనని తెలిపింది. వీరికి తినడానికి బుక్కెడు బువ్వ దొరకట్లేదు. ఆకలి వారి ప్రాణాలను తోడేస్తోంది. రోజూ వందలాది మందిని కబళిస్తోంది. మరోవైపు కరోనా కారణంగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి పేద ప్రాంతాలకు అందుతోన్న సాయం కూడా తగ్గుతోంది.

సైన్యంపైనే ఖర్చు
కరోనా, లాక్ డౌన్ లతో తలెత్తిన ఆర్థిక సంక్షోభానికి యుద్ధ వాతావరణం తోడు కావడంతో సుమారు 5.2 లక్షల మంది ఆకలి చావులకు గురయ్యారని ఆక్స్‌ ఫాం ఆవేదన వ్యక్తం చేసింది. చాలా దేశాలు కరోనా ఉన్నా యుద్ద పరిస్థితుల కారణంగా తమ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీ బలగాల పటిష్ఠత కోసం ఖర్చు చేయక తప్పలేదని వెల్లడించింది. ఈ ఖర్చు రూ. 5,100 కోట్ల డాలర్లు దాటిందని.... పేదల ఆకలి తీర్చేందుకు ఐక్యరాజ్యసమితి ఖర్చు చేయాలనుకున్న దాని కన్నా ఇది ఆరు రెట్లు ఎక్కువని తేల్చి చెప్పింది. 

అంతర్‌ యుద్దాలతో
ఆఫ్ఘనిస్థాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమన్ వంటి అంతర్‌ యుద్దాల్లో చిక్కుకున్న దేశాల్లో  ఆకలి చావుల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్ డౌన్ లతో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాబిన్నమైందని, దాంతో ఆహార పదార్థాల ధరలు ప్రపంచవ్యాప్తంగా 40 శాతం వరకు పెరిగాయని సూత్రీకరించింది. ఈ దశాబ్దంలోనే ధరల పెరుగుదలలో ఇదే అత్యధికమని ఆవేదన వ్యక్తం చేసింది. ఫలితంగా నిరుపేదలు ఆకలి రాజ్యంలోకి నెట్టివేయబడుతున్నారని పేర్కొంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top