మస్క్‌ క్షమాపణలపై స్పందించిన ట్రంప్‌.. ఏమన్నారంటే.. | Donald Trump Says Musks Apology Was Very Nice After Ugly Public Feud, Check Story Inside | Sakshi
Sakshi News home page

మస్క్‌ క్షమాపణలపై స్పందించిన ట్రంప్‌.. ఏమన్నారంటే..

Jun 12 2025 9:21 AM | Updated on Jun 12 2025 10:31 AM

Donald Trump Says Musks Apology was Very Nice

వాషింగ్టన్‌ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, టెక్‌ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌లు మళ్లీ  దగ్గరకానున్నరనే సంకేతాలు వెలువడుతున్నాయి. కొద్దిరోజుల పాటు ఈ ఇద్దరు స్నేహితులు సోషల్‌ మీడియాలో పరిస్పరం విమర్శలు చేసుకున్నారు. వీరి వివాదం ఎటువైపునకు దారితీస్తుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే ఇంతలో ఎలాన్‌ మస్క్‌ ట్రంప్‌ను క్షమాపణలు కోరుతూ, ట్వీట్‌ చేయడం  ఆసక్తికర పరిణామంగా మారింది.  

ఎలాన్‌ మస్క్‌ అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు. ‘న్యూయార్క్ పోస్ట్‌’తో జరిగిన  ఫోన్ ఇంటర్వ్యూలో మస్క్‌  క్షమాపణలపై ట్రంప్‌ వ్యాఖ్యానించారు. తన భాషలో కఠినమైన పదాలు ఉన్నప్పటికీ, తనకు కఠినమైన భావాలు లేవని ట్రంప్‌ అన్నారు. మస్క్‌ తనను క్షమాపణలు కోరడం చాలా బాగుందని భావిస్తున్నానని ట్రంప్‌ పేర్కొన్నారు.  బడ్జెట్‌ బిల్లుపై మస్క్ పలు విమర్శలు చేశారని, అందుకు అతనిని నిందించనని కూడా ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో కొంత నిరాశకు గురయ్యానని కూడా అన్నారు.

ట్రంప్‌కు మాజీ సహాయకుడు ఎలోన్ మస్క్ గత వారంలో ట్రంప్‌పై విమర్శలు గుప్పిస్తూ, సోషల్‌ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. దీంతో వీరి మధ్య వైరం పెరిగింది. ఆ తరువాత ట్రంప్ తన రాజకీయ విజయంలో మస్క్ పాత్రను తక్కువ చేస్తూ స్పందించారు. దీనికి ప్రతిస్పందనగా 2024 ఎన్నికల్లో ట్రంప్‌ తన మద్దతు కారణంగానే విజయం సాధించారని మస్క్ పేర్కొన్నారు. తాజాగా మస్క్ తాను గతంలో ట్రంప్‌పై ఆరోపణలు చేస్తూ, చేసిన పోస్టులలో కొన్నింటిని తొలగించి క్షమాపణలు కోరారు. న్యూయార్క్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్‌తో ప్రైవేట్‌గా మాట్లాడిన తర్వాత మస్క్‌ అధ్యక్షుడు ట్రంప్‌ను క్షమాపణలు  కోరారు. సోమవారం మస్క్ వ్యక్తిగతంగా ట్రంప్‌ను కలిసినట్లు కొన్ని  వార్తలు వెలువడ్డాయి. ఆ సమయంలో ట్రంప్.. ఎలాన్‌ మస్క్‌ క్షమాపణలను అంగీకరించారని సమాచారం. అయితే వారి మునుపటి సంబంధాలను పునరుద్ధరించేందుకు ట్రంప్‌ సిద్ధంగా ఉన్నారో లేదో స్పష్టం చేయలేదని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Bangladesh: ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ధ్వంసం

Advertisement
 
Advertisement
Advertisement