ఇనార్బిట్‌లో ఐసీసీ వరల్డ్‌ కప్‌ ట్రోఫీ ప్రదర్శన

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: క్రికెట్‌ అభిమానుల సందర్శనార్థం నిర్వహిస్తున్న ఐసీసీ వరల్డ్‌ కప్‌ ట్రోఫీ టూర్‌ నగరానికి వచ్చింది. మాదాపూర్‌లోని ఇనార్బిట్‌ మాల్‌లో ఈ ట్రోఫీని బుధవారం ప్రదర్శించారు. క్రికెట్‌ ప్రేమికులు కప్‌ని చూసేందుకు దానితో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. ఈ సందర్భంగా క్యాచ్‌ ది మ్యాచ్‌ విత్‌ నిస్సాన్‌ పేరిట ఓ కాంటెస్ట్‌ నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి వరల్డ్‌కప్‌ క్రికెట్‌ టికెట్లను బహుమతిగా అందించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

త్వరలో మరో రెండు లింక్‌ రోడ్లు

సాక్షి, సిటీబ్యూరో: ప్రజల ప్రయాణ సమయం తగ్గించేందుకు, ట్రాఫిక్‌ చిక్కులు లేని సాఫీ ప్రయాణానికి ఉద్దేశించిన లింక్‌, స్లిప్‌ రోడ్లలో మరో రెండు లింక్‌ రోడ్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్‌ –లాంకో హిల్స్‌, ఉస్మాన్‌నగర్‌– వట్టినాగుల పల్లి మధ్య హెచ్‌ఆర్‌డీసీ నిర్మిస్తున్న లింక్‌రోడ్లు తుది దశలో ఉన్నాయని మున్సిపల్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ ఎక్స్‌(ట్విట్టర్‌) వేదికగా షేర్‌ చేశారు. ఇవి అందుబాటులోకి వస్తే ఈ మార్గాల్లో ప్రయాణించేవారికి ఎంతో సదుపాయం కలుగుతుంది.

24న మజ్లిస్‌ మిలాద్‌ సభ

సాక్షి, సిటీబ్యూరో: మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా హైదరాబాద్‌ దారుస్సలాం మైదానంలో ఈ నెల 24న ఆదివారం సాయంత్రం 7 గంటలకు జల్సే రహ్మతుల్‌–లిల్‌–ఆలమీన్‌ సభ నిర్వహిస్తున్నట్లు ఏఐఎంఐఎం వర్గాలు తెలిపాయి. ఈ సభలో పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఇస్లామిక్‌ స్కాలర్స్‌ పాల్గొని ప్రసంగించనున్నారు. 25వ తేదీ సోమవారం రాత్రి 8 గంటల ముషాయిరా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముషాయిరాలో వివిధ రాష్ట్రాల కవులు పాల్గొంటారని పేర్కొన్నారు.

గణేష్‌ మండపం వద్ద అపశ్రుతి

కరెంట్‌ షాక్‌తో ఇంటర్‌ విద్యార్థి మృతి

సైదాబాద్‌: వినాయక చవితి నవరాత్రి వేడుకల్లో భాగంగా సైదాబాద్‌ డివిజన్‌ సాయిరాంనగర్‌ కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్‌ మండపం వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. మండపం వద్ద ఏర్పాట్లు చేస్తుండగా కరెంట్‌ షాక్‌ తగలడంతో ఇంటర్‌ విద్యార్థి మృతి చెందాడు. సాయిరాంనగర్‌ కాలనీకి చెందిన చిన్న సాయిలు కూలి పనులు చేస్తుంటాడు. ఇద్దరు కూతుళ్లకు వివాహం కావడంతో ప్రస్తుతం భార్య ఇద్దరు కుమారులతో ఉంటున్నాడు. అతని పెద్ద కుమారుడు ఆర్‌.వర్ధన్‌కుమార్‌ (17) ఇంటర్‌ చదువుతుండగా, చిన్న కుమారుడు భరత్‌కుమార్‌ 8వ తరగతి చదువుతున్నాడు. ప్రతి ఏడాది కాలనీలో ఏర్పాటు చేసే గణేష్‌ మండపం వద్ద వర్ధన్‌కుమార్‌ చురుకుగా ఉండేవాడు. ఈ ఏడాది కూడా కాలనీలో ఏర్పాటు చేసిన మండపం వద్ద ఈ నెల 18న రాత్రి పూజల్లో పాల్గొన్నాడు. రాత్రి 11 గంటల సమయంలో మండపం పైన కవర్‌ గాలికి లేస్తుండటంతో దానిని సరి చేయడానికి పూనుకున్నాడు. ఇనుప తీగతో కవర్‌ను కట్టే ప్రయత్నంలో ఉండగా ప్రమాదవశాత్తు పైన ఉన్న కరెంట్‌ తీగల వలన వర్ధన్‌కుమార్‌కు షాక్‌ తగిలింది. అక్కడే ఉన్న స్థానికులు కర్రతో అతడిని వెనుకకు లాగి వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే వర్ధన్‌కుమార్‌ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఘటనపై మంగళవారం తండ్రి ఫిర్యాదు మేరకు సైదాబాద్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top