ఖర్చుకు పైసలెట్లా?
ఎన్నికల వ్యయంపై అభ్యర్థుల ఆందోళన
సంగెం: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. నామినేషన్లు, పరిశీలన పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీ రహిత ఎన్నికలు జరుగుతున్నా ఆయా పార్టీల నేతలు తమ నాయకులు, అనుచరులను బరిలో దింపారు. అయితే పోటీలో ఉన్న అభ్యర్థులకు పైసల రంది పట్టుకుంది. తమ గెలుపు కోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి ముందుకొస్తున్న అభ్యర్థులు తమ ఆస్తులను తనఖా పెట్టడానికి, కొందరు అమ్మడానికి సిద్ధపడుతున్నారు.
రూ.10 నుంచి రూ.30 లక్షలకు పైగా ఖర్చు..
చిన్న పంచాయతీల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ. 10 లక్షలు, మేజర్ గ్రామపంచాయతీల పరిధిలో పోటీ చేసే అభ్యర్థులు రూ. 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఖర్చు చేసేందుకై నా వెనుకాడడం లేదు. జనరల్, బీసీలకు రిజర్వ్ అయిన గ్రామాల్లో పోటాపోటీగా ఖర్చు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామాల్లో సర్పంచ్ కీలకం కావడం.. నిధులన్నీ సర్పంచ్ ఆధ్వర్యంలోనే ఖర్చుచేయనుండడంతో పోటీకి సై అంటున్నారు. ఒక వేళ ఓడిపోతే సెంటిమెంట్‌తో వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనైనా పదవి దక్కుతుందనే ఆశాభావంతో ముందుకు సాగుతున్నారు.
గెలిచినా.. ఓడినా కష్టాలే..
డబ్బులు భారీగా ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచిన వారికి మొదట పదవి ఆనందపరిచినా, వెంటనే అప్పులు తీర్చడం మొదటి ప్రాధాన్యతగా మారనుంది. ఓడిపోయిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉండనుంది. అప్పులు చెల్లించలేక కుంటుంబం మొత్తం ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఇలా ఎన్నికల్లో యథేచ్ఛగా డబ్బులు ఖర్చు చేసి గెలిచినా, ఓడినా ఇరువురు అభ్యర్థులు సైతం కష్టాలు తప్పకపోవచ్చనే చర్చ జరుగుతోంది. పోటీ చేసిన అభ్యర్థులు సంయమనం పాటించి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే కంటే నిజాయితీగా ప్రచారం చేసి నిస్వార్థంతో సేవ చేస్తామని ఓట్లు పొందితే బాగుంటుదని యువత అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఓటర్లు కూడా ఎన్నికల సమయంలో వచ్చే మద్యం, డబ్బులకు ఆశపడి ఓటును అమ్ముకుంటే ఐదేళ్లు కష్టాలు తప్పవని ఆలోచించాలి. అందుకే డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా గ్రామాభివృద్ధికి సేవ చేసేవారికి ఓట్లు వేసి ఎన్నుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
డబ్బుల సర్దుబాటుకు ఇబ్బందులు
ఆస్తుల తనఖాకు సిద్ధమవుతున్న
పోటీదారులు


