
రాష్ట్రస్థాయి నాటికల పోటీలు ప్రారంభం
తెనాలి: రోటరీ కళాపరిషత్, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ –తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ద్వితీయ ఆహ్వాన నాటికల పోటీలు శనివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో మూడు రోజులపాటు జరిగే ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి జ్యోతిప్రజ్వలన చేశారు. ప్రారంభ సభకు ప్రముఖ సినీ మాటల రచయిత, కళల కాణాచి, తెనాలి అధ్యక్షుడు డాక్టర్ సాయిమాధవ్ బుర్రా అధ్యక్షత వహించారు. డీఎల్ కాంతారావు పోస్టల్ ఎంప్లాయీస్ కళాపరిషత్ అధ్యక్షుడు డీఎల్ కాంతారావు, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు, రంగస్థల, సినీనటుడు వేమూరి విజయభాస్కర్, బి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తొలిగా హేలాపురి కల్చరల్ అసోసియేషన్, ఏలూరు వారి ‘సారీ...రాంగ్ నెంబర్’ నాటికను ప్రదర్శించారు. చింతల మల్లేశ్వరరావు రచనను మహ్మద్ ఖాజావలి దర్శకత్వంలో ప్రదర్శించారు. అనంతరం కళాంజలి, హైదరాబాద్ వారి ‘వీడేం మగాడండీ బాబు’ హాస్యనాటికను ప్రదర్శించారు. పీటీ మాధవ్ రచనకు కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. నిర్వాహకులు ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర శ్రీనివాసరావులు పర్యవేక్షించారు.

రాష్ట్రస్థాయి నాటికల పోటీలు ప్రారంభం