
జీతాల పెంపు, పింఛన్ పునరుద్ధరణ కోరుతూ నిరసన
తాడికొండ: జీతాల పెంపుతో పాటు పింఛన్లను పునరుద్ధరించాలని కోరుతూ తుళ్లూరు సీఆర్డీయే ప్రాంతీయ కార్యాలయం ఎదుట శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో రాజధాని ఏరియా పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు ఎం. రవి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులందరికీ రూ.21 వేలు జీతం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో అందరికీ రూ.21 వేలు ఇస్తూ, రాజధాని కార్మికులకు మాత్రం రూ.12 వేలు ఇవ్వడం అన్యాయమని ఖండించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచకపోవడంతో కార్మికుల కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం, సీఆర్డీయే అధికారులు స్పందించి కార్మికుల జీతాలు పెంచాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం. భాగ్యరాజు, కార్మిక సంఘం కార్యదర్శి కుంభా గోపిరాజు, నాయకులు లేళ్ల సుఖవేణి, నల్లగొండ వీర్లంకమ్మ, మేకల మేరి, జెట్టి లక్ష్మీతిరుపతమ్మ, వి. బుజ్జి, శిరీష, సీఐటీయూ నేత పేరం బాబూరావు పాల్గొన్నారు.