
పెరుమాళ్లకు సామూహిక కళ్యాణ మహోత్సవం
తాడేపల్లి రూరల్: ఎంటీఎంసీ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై అన్ని ఆలయాల పెరుమాళ్లకు బుధవారం సామూహిక కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ చిన్న జీయర్ స్వామి సమక్షంలో 8వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ వేడుక నిర్వహించామని చెప్పారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ స్వామి వారిని గరుడ వాహనంపై శ్రీనివాసుని గిరి పరిక్రమణ గావించామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వేదవిద్యార్థులు, భక్తులు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.