సమృద్ధిగా ఆక్సిజన్‌.. సరఫరానే సమస్య

Nikhil Narain Article On Oxygen Supply - Sakshi

అమెరికన్‌ రాక్‌ బాండ్‌ గాయకుడు పియర్ల్‌ జామ్‌ 2009లో పాడిన పాట శీర్షిక పేరు జస్ట్‌ బ్రీత్‌ ఇప్పుడు మనం జీవిస్తున్న యుగ సందర్భానికి సరిగ్గా సరిపోయే పేరు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మరణాలకు కారణమవుతున్న కోవిడ్‌–19 ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని స్తంభింపజేసింది. కోవిడ్‌–19 సాంక్రమిక వ్యాధి. ప్రధానంగా ఊపిరి ఆడనివ్వకుండా చేసి మరణానికి కారణమవుతుంది. ఆసుపత్రుల్లో కొత్త రకం వైరస్‌కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వైద్య అవసరాలకోసం ఆక్సిజన్‌ కీలకం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి విషమించిన రోగులకు జీవనదానమిచ్చి ప్రాణాలను కాపాడుతున్నది ఆక్సిజన్‌ మాత్రమే. కరోనారోగుల్లో 80 శాతం మందికి స్వల్ప మాత్రంగా లక్షణాలు కనీకనిపించని విధంగా పొడసూపుతుండగా మిగిలిన 20 శాతమంది రోగులకు ఆక్సిజన్‌ మద్దతు అవసరమవుతోంది. అసాధారణమైన కేసుల్లో రోగులకు వెంటిలేటర్లు కూడా వాడుతున్నారు.

భారత్‌లో విషమ పరిస్థితుల్లో ఉన్న కోవిడ్‌–19 రోగులకు తక్షణం వైద్యపరమైన ఆక్సిజన్‌ను అందించాల్సిన అవసరాన్ని గుర్తించిన కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సరఫరా చేసే పద్ధతులపై ఆయా రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ పరిశ్రమలకు చెందిన సభ్యులతో భారత్‌లో పారిశ్రామిక  గ్యాస్‌ ఉత్పత్తిదారులు, అనుబంధ పరిశ్రమలతో కూడిన జాతీయ ప్రాతినిధ్య సంస్థ అఖిల భారత ఇండస్ట్రియల్‌ గ్యాస్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఏఐఐజీఎమ్‌ఏ)కు ఏప్రిల్‌ 1న కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తరం పంపింది. భారత్‌లో, ప్రపంచంలోని అత్యంత ప్రధాన ఆక్సిజన్‌ తయారీ సంస్థలకు చెందిన 270మంది సభ్యులు ఈ సంస్థలో ఉంటున్నారు. వీటిలో చాలా కంపెనీలు వైద్య అవసరాల కోసం ఆక్సిజన్‌ సిలిండర్లను తయారు చేస్తుం డగా, కొన్ని కంపెనీలు ద్రవ ఆక్సిజన్‌ను తయారు చేస్తున్నాయి. 

దేశంలో వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వ శాఖ, కేంద్ర ఔషథ ప్రామాణిక నియంత్రణా సంస్థ (సీడీఎస్‌సీఓ) కలిసి వైద్యపరమైన ఆక్సిజన్‌ ఉత్పత్తి సరఫరాను నియంత్రిస్తున్నాయి. మెడికల్‌ గ్యాస్‌ ఉత్పత్తి, పంపిణీల నిర్వహణకోసం అనేక కేంద్ర సంస్థలతో టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పర్చారు. వైద్యపరమైన ఆక్సిజన్‌ నిల్వలను సిద్ధం చేయడానికి కేంద్ర హోంశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ, డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా కలిసి పలు చర్యలు చేపట్టాయి. ప్రమాణాలు ఏమాత్రం దెబ్బతినకుండా వైద్యప్రయోజనాల కోసం ఆక్సిజన్‌ తయారీకి గాను పారిశ్రామిక ఉత్పత్తి సంస్థలను అనుమతించారు. భారత ప్రభుత్వం చేపట్టిన అతి గొప్ప చర్యగా దీనికి విస్తృతంగా ప్రశంసలు లభించాయి. దీనివల్ల వైద్య ఆక్సిజన్‌ కొరత సవాళ్లను ఎదుర్కోవడమే కాకుండా, మారుమూల ప్రాంతాల్లోని రోగుల అవసరాలను కూడా తీర్చేందుకు ఎంతగానో ఉపయోగపడింది.

లాక్‌డౌన్‌ సమయంలో గ్యాస్‌ సిలిండర్లను తయారుచేసి రవాణా చేయడానికి కేంద్ర ప్రభుత్వం పలు ఆక్సిజన్‌ ఉత్పత్తి దారులకు అనుమతించింది. దీంతో గత సంవత్సర కాలంగా దేశంలోని ఆసుపత్రులు, ఐసోలేషన్‌ వార్డులకు తగినంత మెడికల్‌ ఆక్సిజన్‌ సిలిండర్లను సరఫరా చేయడానికి వీలయింది. ఇప్పుడు కోవిడ్‌ మహమ్మారి ప్రాణాంతకంగా మారిన నేపథ్యంలో తక్షణ ప్రాతిపదికన మెడికల్‌ ఆక్సిజన్‌ సిలిండర్ల సేకరణకుగాను సెంట్రల్‌ మెడికల్‌ సర్వీసెస్‌ సొసైటీ బిడ్లను ఆహ్వానించింది.

ఏఐఐజీఎమ్‌ఏ ప్రెసిడెంట్‌ సాకేత్‌ టికు అభిప్రాయం ప్రకారం భారత్‌లో వైద్యపరమైన ఆక్సిజన్‌ నిల్వలు చాలినంత ఉన్నాయి. లాక్‌ డౌన్‌ విధింపుతో పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్‌ సరఫరాను తగ్గించడంతో వైద్య అవసరాల కోసం ఆక్సిజన్‌ గణనీయంగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు సైతం దేశంలో 80 వేల టన్నుల ఆక్సిజన్‌ నిల్వలు ఉంటుండగా రోజుకు 700 టన్నుల వైద్యపరమైన ఆక్సిజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఆక్సిజన్‌ నిల్వలు సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడంపై తాము ప్రస్తుతం దృష్టి పెడుతున్నామని, ఇది కొలిక్కి వస్తే దేశంలోని అన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సమృద్ధిగా సరఫరా చేయగలమని సాకేత్‌ టికు నొక్కి చెప్పారు. 

ప్రపంచవ్యాప్తంగా కూడా ఆక్సిజన్‌ నిల్వలు సమృద్ధిగా ఉంటున్నాయి కానీ సరఫరా వ్యవస్థ కారణంగానే కొన్నిచోట్ల కొరత ఏర్పడుతోందని గ్యాస్‌ వరల్డ్‌ సంస్థ బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ మేనేజర్‌ కరీనా కోచా అన్నారు. యూరప్, అమెరికాలతో పోలిస్తే ఆక్సిజన్‌ అవసరమైన కేసులు భారత్‌లో తక్కువగానే ఉంటున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగానే రవాణాకు ఇబ్బంది ఏర్పడింది. అంతే కానీ దేశ ప్రజలు ఆక్సిజన్‌ కొరతపై భయాందోళనలు అవసరం లేదని ఆమె అన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే వైద్య అవసరాలకు ఆక్సిజన్‌ సమస్యే కాదని తేల్చిపడేశారు.

పైగా భవిష్యత్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత్‌ వినూత్నమార్గాలను అన్వేషిస్తోంది. విశాఖపట్నం పోర్టులో ఒక ఆక్సిజన్‌ బాటిల్‌ని ఆరుమంది రోగులకు ఏకకాలంలో సరఫరా చేయగలిగేలా పోర్టబుల్‌ మల్టీ ఫీడ్‌ ఆక్సిజన్‌ మానిఫోల్డ్‌ను రూపొందించారు. ఇప్పుడు దేశానికి తక్షణం వెంటిలేటర్ల అవసరం ఉంది తప్ప ఆక్సిజన్‌ కొరతే లేదని చెప్పవచ్చు. మహీంద్రా గ్రూప్, మారుతి, హ్యుండయ్‌ ఇండియా వంటి భారీ సంస్థలు కూడా ఇప్పుడు వెంటిలేటర్ల ఉత్పత్తిలో భాగమవుతున్నాయి. కాబట్టి, ఇకపై ఆక్సిజన్‌ కొరత సమస్య కాదు.

నిఖిల్‌ నరేన్, సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top