వ్యాక్సిన్‌ కూడా సరుకేనా?

K Sujatha Rao Article On Covid Vaccine - Sakshi

విశ్లేషణ

ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందించడం ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం కనీసంగా చేయవలసిన పని. కానీ కోట్లాదిమంది ప్రజలకు సార్వత్రిక ప్రయోజనం కలిగించే అంశం కూడా మార్కెట్‌ సరకుగా మారిపోవడాన్ని అర్థం చేసుకోవడం కష్టసాధ్యమే. విస్తృత ప్రజానీకం ప్రాణాలు కాపాడి భారత్‌ను ప్రస్తుత దుర్భర పరిస్థితుల నుంచి కాపాడటం కంటే స్వేచ్ఛా మార్కెట్‌ భావజాలంపై కేంద్రప్రభుత్వానికి ఉన్న సానుకూల అభిప్రాయమే పైచేయి సాధించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్షణంలో దేశ ఆరోగ్య భద్రతకు అత్యంత కీలకమైన ఒక ఉత్పత్తిపై వేరువేరు ధరల వ్యూహాలను అమలు చేయడాన్ని మరోలా ఆర్థం చేసుకోలేం.

టీకాలు వేసే ప్రక్రియ ఉమ్మడిగా ప్రజలకు ప్రయోజనం కలిగించే అంశం. పైగా సాంక్రమిక వ్యాధులు ప్రబలిపోయినప్పుడు మరణాలు, బహుముఖ వ్యాధులను తగ్గించడానికి కారుచౌక మార్గం వ్యాక్సినేషన్‌ మాత్రమే. అందుకే పాశ్చాత్య దేశాలన్నీ తమ జనాభాకు ఉచితంగానే వ్యాక్సిన్‌ అందిస్తూ వస్తున్నాయి. ఈ దేశాల్లో సోషలిస్టు ప్రభుత్వాలు లేవు. అమెరికాలో వలే పశ్చిమదేశాలన్నీ పూర్తిగా మార్కెట్‌ ఆధారితంగా నడుస్తుం టాయి. ఈ దేశాల్లోని మెజారిటీ ప్రజలకు ఒక కరోనా టీకాపై 20 డాలర్లు పెట్టగలగేటంత తలసరి ఆదాయం ఉంటున్నప్పటికీ జనాభా మొత్తానికి ఇవి ఉచిత టీకాను అందిస్తున్నాయి. కానీ భారత రాజకీయ నాయకత్వం దీనికి పూర్తి భిన్నంగా ఎలా ఆలోచిస్తోంది? పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్న వ్యాక్సిన్‌ సేకరణ విధానాన్ని భారత ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందో అర్థం చేసుకోవడం అసాధ్యం. అంతకుమించి సామూహిక ప్రజాప్రయోజనానికి సంబంధించిన అంశం మన దేశంలో మార్కెట్‌ సరకుగా ఎలా మారిపోయింది? కోట్లాదిమంది ప్రజల ప్రాణాలు కాపాడి భారత్‌ను ప్రస్తుత దుర్భర పరిస్థితుల నుంచి కాపాడటం కంటే స్వేచ్ఛా మార్కెట్‌ భావజాలంపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సానుకూల అభిప్రాయమే పైచేయి సాధించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్షణంలో దేశ ఆరోగ్య భద్రతకు అత్యంత కీలకమైన ఒక ఉత్పత్తిపై వేరువేరు ధరల వ్యూహాలను అమలు చేయడాన్ని మరోలా ఆర్థం చేసుకోలేం. 

అపారమైన లాభాలపై దృష్టి ఉండే మార్కెట్‌ అనుకూలవాదులకు ప్రజాహితం అనే భావనే రుచించకపోవచ్చు. అలాంటి సందర్భంలో ప్రభుత్వం కనీసం ఆర్థిక సమర్థత, వనరుల హేతుపూర్వక వినియోగం విషయంలో అయినా దాపరికం లేకుండా వ్యవహరిం చాల్సి ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ కనీవినీ ఎరుగనంత స్థాయికి పతనమైపోయింది. ఆదాయాలు కుదించుకుపోవడం, కుటుంబాల స్థాయిలో ఆహారం, కనీసం ఆదాయం వంటి ప్రాథమిక అవసరాలు కూడా తీరని పరిస్థితుల్లో కోవిడ్‌–19 ఆర్థిక వ్యవస్థపై కలిగిస్తున్న ప్రభావం సూక్ష్మస్థాయిలో విధ్వంసకరంగా మారింది. దీనికి తోడుగా కునారిల్లిపోయిన ఆరోగ్య మౌలిక వ్యవస్థను, చిన్నాభిన్నమైపోయిన జీవితాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే మన వ్యాక్సిన్‌ కంపెనీలు కనీస ఉత్పత్తి ధర వద్ద లేక ఉత్పత్తి ఖర్చుపై 10 శాతం కనీస లాభంతో వ్యాక్సిన్‌ని అందిస్తున్నాయి. కానీ కొన్ని నెలల్లోపే వ్యాక్సిన్‌ ధర పెరగనుండటం గమనార్హం.

టీకాల కొరత అసలు కారణం
ముందస్తుగా వ్యాక్సిన్‌ కొనుగోలు ఒప్పందాలు లేకపోవడం లేక వ్యాక్సిన్‌ ఉత్పత్తికి సంబంధించిన అన్ని అంశాలను పొందుపర్చి సమగ్రమైన వ్యూహాన్ని అమలు చేసే జాతీయ వ్యాక్సినేషన్‌ ప్లాన్‌ లేకపోవడం వల్లే ఇప్పుడు ఉన్నట్లుండి కోవిడ్‌–19 టీకాల కొరత ముంచుకొచ్చింది. వ్యాక్సిన్‌ ఉత్పత్తి స్థాయిని పెంచడానికి మనం మొదట్లోనే యుద్ధప్రాతిపదికన డజనుకు పైగా బీఎస్‌ఎల్‌–3 స్థాయి అత్యుత్తమ సంస్థలను నెలకొల్పి ఉండాలి. దేశంలో టీకాలకు ఏర్పడుతున్న విస్తృతమైన డిమాండ్‌ని తీర్చేందుకు ఇతర మందుల కంపెనీలను కూడా భాగస్యామ్యం చేయడం ద్వారా మొత్తం టీకాల సరఫరా వ్యవస్థను ముందుకు తీసుకుపోయి ఉండవచ్చు. దీనికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వ వ్యూహం మొత్తం రెండు కంపెనీలపైనే ఆధారపడటమే ప్రస్తుత ప్రతి ష్టంభనకు కారణమైంది. అలాగే జనాభాలోని అధిక శాతానికి టీకాలు వేయగలిగేలా వ్యాక్సినేషన్‌ కేంద్రాలను మరింతగా ఏర్పర్చేలా రాష్ట్రప్రభుత్వాలను ప్రోత్సహించే ముందు చూపు కూడా కరువైపోయింది.

ప్రస్తుతం సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నెలకు 6 కోట్ల డోసులను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. జూలై నాటికి నెలకు 19 కోట్ల వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేసేలా తన సామర్థ్యాన్ని విస్తరింపజేస్తోంది.  కేంద్రప్రభుత్వం, జీఏవీఐ అందించిన రూ. 4,200 కోట్ల ఆర్థిక సహాయం కారణంగానే ఇది సాధ్యపడనుంది. మే 1 నుంచి జూలై నాటికి సీరమ్‌ ఏడాదికి 120 కోట్ల డోసులను ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోనుంది. ఇకపోతే భారత్‌ బయోటెక్‌ ప్రస్తుతం నెలకు కోటి టీకాలు ఉత్పత్తి చేస్తోంది.  కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ. 1,500 కోట్ల ఆర్థిక సహాయంతో ఈ సంస్థ సామర్థ్యం కూడా గణనీయంగా పెరగనుంది. ఇతర కంపెనీలతో ఒప్పందాల మేరకు జూలై 22 నాటికి 70 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.

బహిరంగ ప్రకటనల మేరకు జూలై 22 నాటికే భారత్‌ తనకు అవసరమైన డోసులను పొందే అవకాశముందని స్పష్టమవుతోంది. ఇప్పటినుంచి వచ్చే రెండు నెలలలోపు భారత్‌ విదేశాలకు పంపపలసిన బాధ్యతను నెరవేర్చడానికి, దేశీయ డిమాండును తట్టుకోవడానికి 12 కోట్ల డోసులను ఉత్పత్తి చేసి పంపిణీ చేయగలగాలి. వీటన్నింటితోపాటు ప్రభుత్వం టీకాకు అర్హులైన వారి సంఖ్యను వేగంగా పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికైతే ప్రభుత్వం 96 కోట్ల వయోజనులందరినీ టీకాల పరిధిలోకి తీసుకొస్తోంది. వీరిలో 30 కోట్లమంది ఆరోగ్య సిబ్బందికి, ప్రంట్‌ లైన్‌ కార్మికులకు, సాయుధబలగాలు వంటి అత్యవసర సర్వీసులకు, 45 ఏళ్లకు పైబడిన వయసు కలవారికి ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తం 60 కోట్ల డోసులు అవసరం కాగా, ఇప్పటివరకు ప్రభుత్వం 12 కోట్లమందికి టీకాలువేసింది. ఇప్పుడు టీకా నిల్వలు లేవు. దీంతో 50 కోట్ల మంది ప్రజల డిమాండ్‌ నెరవేరడం కష్టమైపోతోంది.

ఏప్రిల్‌ 20న 18–45 ఏళ్లలోపు వయసు ఉన్న మరో 63 కోట్లమందికి టీకాలు వేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వీరిలో 70 శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకున్నట్లయితే సామూహిక రోగ నిరోధక శక్తి సాధ్యపడుతుంది. ముందుగా 44 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేయాలంటే వ్యర్థాలతో సహా వంద కోట్ల డోసులు అవసరం అవుతాయి. వీటిలో 20 శాతం వ్యాక్సిన్‌ను ప్రైవేటుగా మార్కెట్‌ చేస్తారనుకుంటే, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంకా 80 కోట్ల డోసులు అవసరం అవుతాయి. అంటే 45 ఏళ్ల పైబడిన వారికి 100 శాతం టీకాలు వేయాలన్నా, 18–45 ఏళ్లలోపు వారికి 70 శాతం టీకాలు వేయాలన్నా దానికి కేంద్రప్రభుత్వానికి 100 కోట్ల పైబడిన డోసులు అవసరం అవుతాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య టీకా ధరవరల్లో తేడాను పాటిం చడం ద్వారా, ప్రభుత్వాలను మార్కెట్‌లో టీకాలు కొనుగోలు చేసేలా విధానాన్ని మార్చడం ద్వారా తక్షణం జరిగేదేమిటంటే. దేశంలోని పేద రాష్ట్రాలు మరింత మొత్తాన్ని కోవిడ్‌–19 టీకాలకోసం చెల్లిం చాల్సి ఉంటుంది. అంటే మౌలికంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు టీకా ధరలు జరిమానా అవుతుండగా మందుల కంపెనీలు లాభాల బాట పట్టనున్నాయి. రాష్ట్రాలమధ్య వ్యత్యాసాలతోపాటు టీకాలకు ఖర్చు పెట్టే స్తోమత ఉన్న, లేని రాష్ట్రాల మధ్య అగాథం పెరిగిపోతుంది. అలాగే వ్యాక్సిన్‌లను కొనుగోలు చేయడానికి పలు నిరుపేద రాష్ట్రాలు తమ అత్యవసరాలను పణంగా పెట్టి తమ సొంత వనరులను టీకాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సినేషన్‌ విధానం అసమానత్వంతోనూ, కఠినంగాను ఉంటోందన్నది స్పష్టం. అదే సమయంలో వైరస్‌కు హద్దులు లేవు. నిరుపేదలను ప్రస్తుత కేంద్ర విధానం గాలికి వదిలేస్తున్నందున వైరస్‌ మళ్లీ కమ్ముకు రావడం ఖాయం. ఇలాంటి లోపభూయిష్టమైన, ప్రమాదకరమైన వ్యాక్సినేషన్‌ విధానాన్ని సవరించవలసిన అవసరం ఉంది. అత్యవసరమైన వ్యాక్సిన్లను సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం తన మార్కెట్‌ శక్తిని ఉపయోగించి, అందరికీ ఉచితంగా టీకాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే కరోనా బారిన పడి విధ్వంసానికి గురైన ప్రజారాశులకు జీవితంపై భరోసా కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వం కనీసంగా చేయవలసిన పని ఇదే మరి.


కె. సుజాతారావు 
వ్యాసకర్త మాజీ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య శాఖ
(ది వైర్‌ సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top