Sakshi News home page

వెక్కిరించిన వారే గెలిపించారు

Published Sat, Nov 28 2020 12:48 AM

Sakshi Special Story on Woman Sarpanch Kavita Bhondve

ఆమెను చూసి నేషనల్‌ మీడియా కూడా మెచ్చుకుంటోంది. ‘నిన్ను నువ్వు సరిగ్గా చూసుకోలేవు... ఊరినెలా చూసుకుంటావు’ అన్నారు ఆమె మొదటిసారి సర్పంచ్‌గా పోటీ చేసినప్పుడు ఊరి వాళ్లు. అయినా ప్రజా సేవకు తన శారీరక పరిమితులు అడ్డం కావు అనుకుంది నాసిక్‌కు చెందిన కవితా భోండ్వే. ఆమె పని చేయడం మొదలెట్టింది. మార్పును చూపించింది. వెక్కిరించిన నోళ్లు మెచ్చుకోళ్లు మెదలెట్టాయి. అంతేనా? రెండోసారి ఆమెను సర్పంచ్‌గా గెలిపించాయి. గత తొమ్మిదేళ్లుగా సర్పంచ్‌గా ఉన్న కవితా భోండ్వే స్ఫూర్తిగాధ ఇది.

తండ్రి 15 ఏళ్ల పాటు పంచాయతీ మెంబర్‌గా ఉన్నాడు. ఉన్నాడు కాని మెల్లమెల్లగా తనకు చదువు రాకపోవడం పంచాయతీ వ్యవహారాల్లో అవరోధంగా మారుతోందని గ్రహించాడు. 2011 సంవత్సరం అది. మహారాష్ట్ర నాసిక్‌ జిల్లాలోని దిందోరి తాలుకాలో రెండు గ్రామాలకు (దెహెగావ్, వాల్గాగ్‌) సర్పంచ్‌ ఎన్నికలు వస్తున్నాయి. తన కుమార్తె చదువుకుంది. ఆమెను సర్పంచ్‌గా నిలబెడితే? అనుకున్నాడు. కాని ఆ అమ్మాయికి కుడి కాలికి పోలియో ఉంది.

‘ఏమ్మా పోటీ చేస్తావా?’ అని అడిగాడు ఆ తండ్రి పుండలిక్‌ భోండ్వే.
‘పోటీ చేస్తాను నాన్నా’ అంది కూతురు కవితా భోండ్వే.
ఆ సమయానికి కవిత వయసు 25. అంత చిన్న వయసులో ఆ ప్రాంతంలో ఎవరూ సర్పంచ్‌ కాలేదు. అందునా స్త్రీ కాలేదు. పైగా శారీరక పరిమితులు ఉన్నవారు అసలే కాలేదు. రెండు ఊళ్లలోనూ ఈ విషయం పెద్ద వేళాకోళంగా మారింది. మగవారు దీనిని సహించలేకపోయారు. ‘నిన్ను నువ్వు సరిగ్గా చూసుకోలేవు. ఊళ్లను ఏం చూస్తావు?’ అని ప్రశ్నించారు. కవిత గంభీరంగా ఆ హేళనను భరించింది. తన ప్రచారం కొనసాగించింది. మెల్లమెల్లగా చాలామంది స్త్రీలు ఆమె పట్టుదలను గమనించారు. ఊరి మగవారు కూడా కొందరు మద్దతుగా నిలిచారు. సర్పంచ్‌గా ఆమె గెలిచింది.

‘వెక్కిరింతలను ఏమాత్రం మనసులోకి తీసుకోకపోవడం వల్లే నేను ముందుకు వెళ్లగలిగాను’ అని కవిత అంటోంది. కవిత పదవిలోకి వచ్చే సరికి ఊళ్లో ఆకతాయిల ఆట సాగుతోంది. కొన్ని సంఘ వ్యతిరేకమైన పనులు సాగుతున్నాయి. వాటిని మొదట నిలువరించింది ఆమె. ఆ తర్వాత రెండు ఊళ్లలోనూ బాలికల చదువు గురించి, రోడ్ల గురించి, మరుగుదొడ్ల గురించి, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మంజూరయ్యే ఇళ్ల గురించి పని చేసింది. అవినీతి ఊసు లేకుండా సర్పంచ్‌ అనే దాష్టీకం లేకుండా హుందాగా పని చేస్తున్న కవితా అతి త్వరగా జనానికి దగ్గరయ్యింది.

‘చిన్న వయసులో సర్పంచ్‌ అయ్యానని అక్కసు పడ్డవాళ్లు కూడా మెల్లగా నన్ను గుర్తించడం మొదలెట్టారు’ అని కవితా అంది.
పదవిలో ఉన్న ఐదేళ్లు కవితకు ఒకటే పని. ఉదయాన్నే సోదరుడు ఆమెను బైక్‌ మీద దింపితే పంచాయతీ ఆఫీస్‌కు వస్తుంది. పనులు చూసుకుంటుంది. వచ్చినవారి ఇబ్బందులు వింటుంది. జరిగే పనుల అజమాయిషీకి బయలుదేరుతుంది. ఐదేళ్లు గడిచిపోయాయి. మళ్లీ ఎలక్షన్లు వచ్చాయి. ఈసారి ఎలక్షన్లు జరగలేదు. ఎందుకంటే కవితనే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

34 ఏళ్ల కవిత 9 ఏళ్లుగా సర్పంచ్‌గా పని చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఆమె నడక మెల్లగా ఉండవచ్చు. కాని ఆమె సంకల్పం, చిత్తశుద్ధి, అంకితభావం, నిజాయితీ అత్యంత వేగవంతమైనవి. తన రెండు ఊళ్లలో ఆమె స్వయం ఉపాధి గ్రూపులను స్థాపించి స్త్రీల స్వావలంబన కోసం ప్రయత్నిస్తోంది. కవితకు చెట్లు నాటించడం ఇష్టం. గ్రామాల్లో పచ్చదనం కోసం కృషి చేస్తోంది. బహుశా మరికొన్నేళ్లు ఆమె సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ రావొచ్చు. ఎందుకంటే ఆ పాలనలో నీడ ప్రజలకు అంత చల్లగా ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement