Sagubadi: Mobile Paddy Dryer - Here's How It Works and Advantages - Sakshi
Sakshi News home page

Mobie Paddy Dryer: పొలం దగ్గరే ధాన్యం ఆరుదల! ధర రూ. 15 లక్షలు.. 50–60% సబ్సిడీ!

Apr 4 2023 11:37 AM | Updated on Apr 4 2023 12:36 PM

Sagubadi: Mobile Paddy Dryer: How It Works Advantages - Sakshi

రైతులు రోడ్లపై ధాన్యాన్ని ఆరబెడుతూ ప్రజలకు అసౌకర్యం కలిగించటం తగదని సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ధాన్యాన్ని కొద్ది గంటల్లోనే నాణ్యత కోల్పోకుండా ఆరబెట్టుకోవడానికి ట్రాక్టర్‌తో నడిచే పాడీ డ్రయ్యర్లు వీలు కల్పిస్తున్నాయి.

50 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతతో ధాన్యాన్ని నాణ్యత చెడకుండా, మొలక శాతం తగ్గకుండా ఆరబెట్టే ఆధునిక సాంకేతికతతో కూడిన పాడీ డ్రయర్లు బాపట్లలోని కోత అనంతర పరిజ్ఞాన పరిశోధన కేంద్రం ద్వారా రైతులకు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. 

ధాన్యాన్ని నూర్చిన తర్వాత తేమ తగ్గేవరకూ సరిగ్గా ఆరబెట్టకపోవటం వల్ల సుమారు 10 శాతం మేరకు నష్టం కలుగుతోందని అంచనా. అధిక తేమ ఉన్న ధాన్యాన్ని బస్తాల్లో నిల్వ చేస్తే ధాన్యం వేడెక్కి రంగు మారుతుంది. అటువంటి అనుకూల వాతావరణంలో ముక్క పురుగులు, శిలీంధ్రాలు ఆశిస్తాయి. బూజు పడుతుంది. ధాన్యం చెడిపోయి వాసన వస్తుంది. వరి ధాన్యాన్ని (కంబైన్‌ హార్వెస్టర్‌) యంత్రాల ద్వారా కోసిన తర్వాత సక్రమంగా ఆరబెట్టకపోతే నాణ్యత దెబ్బతింటుంది. 

12% కన్నా తక్కువ తేమ శ్రేయస్కరం
సాధారణంగా కంబైన్‌ హార్వెస్టర్‌తో గింజరాలు నష్టాన్ని తగ్గించడానికి వరి ధాన్యంలో తేమ శాతం 22–24% ఉన్నప్పుడు వరి కోతలు చేస్తుంటారు. నాణ్యత కోల్పోకుండా ఉండాలంటే ధాన్యం నూర్చిన 24 గంటల్లోగా తేమ శాతాన్ని 17–18కి తగ్గేలా ఆరుదల చేయాల్సి ఉంటుంది.

వరి ధాన్యాన్ని నాణ్యత కోల్పోకుండా ఆరు నెలల వరకు నిల్వ ఉంచాలంటే తేమను 12–13 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. ఏడాది కంటే ఎక్కువ కాలం నిల్వ ఉంచాలంటే 12 కన్నా తక్కువ శాతానికి తేమను తగ్గించాల్సి ఉంటుంది. ఏకకాలంలో రైతులందరూ పంట నూర్పిళ్లు చేయటం వల్ల పాత పద్ధతుల్లో నేలపైన నచ్చు/ పరదాలపై లేదా రోడ్లపైన ధాన్యాన్ని ఆరబెట్టడం సాధ్యం కావటం లేదు.

ఒక్కోసారి అకాల వర్షాల వల్ల ఆరబెట్టిన ధాన్యం తడిచి నాణ్యత మరింత కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రాక్టర్‌ ద్వారా నడిచే మొబైల్‌ ప్యాడీ డ్రయ్యర్లు రైతులకు ఉపయోగకరంగా ఉన్నాయి. 

గ్రీన్‌సిగ్నల్‌
పరిశోధనా సంస్థలు, కంపెనీలు రూపొందించే వ్యవసాయ యంత్రాలు, పరకరాలను అధికారికంగా క్షేత్రస్థాయిలో సబ్సిడీపై అందుబాటులోకి తేవాలంటే వాటి పనితీరును పరిశీలించి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలోని యంత్రీకరణ– సాంకేతిక విభాగం ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.

ఈ ఏడాది జనవరి 23న యంత్రీకరణ– సాంకేతిక విభాగం డిప్యూటీ కమిషనర్‌ ఎ.ఎన్‌. మెష్రం 32 యంత్రాలు, పరికరాలకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నైలోని కర్ది డ్రయ్యర్స్‌ సంస్థ రూపొందించిన ప్యాడీ మొబైల్‌ డ్రయ్యర్‌ కూడా ఒకటి. సబ్‌–మిషన్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌ మెకనైజేషన్‌ (ఎస్‌.ఎం.ఎ.ఎం.) పథకం ద్వారా కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్స్‌ / హైటెక్‌ హబ్స్, గ్రామస్థాయి ఫామ్‌ మెషినరీ బ్యాంక్స్‌కు మాదిరిగానే స్వీయ సహాయక బృందాల (ఎస్‌.హెచ్‌.జి.ల)కు కూడా ఈ డ్రయ్యర్‌ను సబ్సిడీపై అందించవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీలు, చిన్న, సన్నకారు రైతులు, మహిళలకు 60%, ఇతరులకు 50% సబ్సిడీపై ఈ మొబైల్‌ పాడీ డ్రయ్యర్‌ను అందించవచ్చని ఆ ఉత్తర్వు పేర్కొంది.   

బ్యాచ్‌కు 2–12 టన్నులు
కోయంబత్తూరులోని ఐసిఏఆర్‌ అనుబంధ సంస్థ అయిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌లోని ప్రాంతీయ విభాగంతో పాటు, బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ కోత అనంతర పరిజ్ఞాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు తమ 2.5 టన్నుల మొబైల్‌ పాడీ డ్రయ్యర్‌ పనితీరును పరీక్షించి, సంతృప్తిని వ్యక్తం చేశాయని కర్ది డ్రయ్యర్స్‌ సంస్థ తెలిపింది.

ధాన్యాన్ని ఎత్తిపోయటం ద్వారా ఆరుదల చేసే అనేక స్టాటిక్‌(స్థిర), మొబైల్‌(చర) డ్రయ్యర్లను ఈ సంస్థ రూపొందిస్తూ దేశ విదేశాల్లో విక్రయిస్తోంది. స్థిరంగా ఒకచోట నెలకొల్పి విద్యుత్‌/ డీజిల్‌ జనరేటర్‌ ద్వారా ధాన్యాన్ని ఆరుదల చేసే 12 టన్నుల సామర్థ్యం గల డ్రయ్యర్లను సైతం ఈ సంస్థ రూపొందించింది. అదేవిధంగా, పొలం దగ్గరకే తీసుకువెళ్లి ధాన్యాన్ని నూర్చిన వెంటనే అక్కడికక్కడే ఆరబెట్టుకునేందుకు ఉపయోగపడే మొబైల్‌ పాడీ డ్రయ్యర్లలో బ్యాచ్‌కు 2 టన్నుల నుంచి 70 టన్నుల సామర్థ్యం కలిగిన డ్రయ్యర్లు అందుబాటులోకి వచ్చాయి.

ట్రాక్టర్‌తో పొలం దగ్గరకే లాక్కెళ్లి రీసర్క్యులేటరీ వ్యవస్థ ద్వారా ధాన్యాన్ని ఆరుదల చేయడానికి ఉపకరించే 2 టన్నుల సామర్ధ్యంగల మొబైల్‌ డ్రయ్యర్‌ ధర రూ. 15 లక్షలు. 50–60% సబ్సిడీపై అందించడానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదిస్తున్నామని కర్ది డ్రయ్యర్స్‌ సంస్థ జనరల్‌ మేనేజర్‌ దిలీపన్‌(90940 13375) తెలిపారు. 

వరితోపాటు మొక్కజొన్న
బ్యాచ్‌కు 1 టన్ను నుంచి 5 టన్నుల సామర్థ్యం గల మొబైల్‌ పాడీ డ్రయ్యర్ల ద్వారా వరి ధాన్యంతో పాటు మొక్కజొన్నలు, తీపి మొక్కజొన్నలు, బార్లీ, గోధుమలను కూడా ఆరుదల చేయవచ్చని దిలీపన్‌ వివరించారు. 35–65 హెచ్‌పి ట్రాక్టర్‌ పిటిఓ ద్వారా ఇవి పనిచేస్తాయి. అతి తక్కువ ఖర్చుతో ధాన్యాలను ఆరబెట్టడంతో పాటు ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను నివారించుకోవచ్చు.

ఎండలో ఆరుబయట ఆరబెట్టే సమయంలో 20% సమయంలోనే (2–2.5 గంటలు) ఈ డ్రయ్యర్‌తో కోత కోసిన రోజే, తక్కువ శ్రమతో ఆరుదల చేసి, వెంటనే బస్తాల్లోకి నింపుకోవచ్చు. ఎక్కువ తక్కువ లేకుండా ధాన్యం అంతా సమంగా, సక్రమంగా ఆరుదల జరుగుతుంది కాబట్టి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. వెంటనే అమ్మేసుకోవాల్సిన అవసరం ఉండదు. నిశ్చింతగా నిల్వ ఉంచుకొని మంచి ధరకు అమ్ముకోవచ్చు.                

మొబైల్‌ డ్రయ్యర్‌ పనితీరు బాగుంది
పచ్చి వరి ధాన్యాన్ని (బక్కెట్‌ ఎలివేటర్‌తో తిరిగి ఎత్తిపోస్తూ) ఆరుదల చేసే ఈ 2.5 టన్నుల మొబైల్‌ డ్రయ్యర్‌ను బాపట్లలోని మా పరిశోధనా కేంద్రంలో పరీక్షించాం. తేమ శాతం 22% నుంచి 13.5%కి తగ్గింది. చాలా బాగా పనిచేస్తోంది.

బ్యాచ్‌కు ముప్పావు ఎకరంలో వరి ధాన్యం (35 బస్తాలు) ఆరుదల చేయొచ్చు. రోజుకు 5 బ్యాచ్‌లు చేయొచ్చు. డ్రయ్యింగ్‌ రెండు దశల్లో చేయాలి. 17–18% వరకు మొదటి దశ, 13% వరకు రెండో దశలో తగ్గించాలి. ఈ ధాన్యాన్ని విత్తనంగా కూడా వాడుకోవచ్చు. మొలక శాతంలో ఎటువంటి తేడా ఉండదు. నూక శాతం తగ్గుతున్నట్లు కూడా నిర్థరణైంది. ప్రభుత్వానికి నివేదిక పంపాం.  
– డా. బి.వి.ఎస్‌. ప్రసాద్‌ (80083 73741), ప్రధాన శాస్త్రవేత్త (వ్యవసాయ ఇంజనీరింగ్‌),అధిపతి, కోత అనంతర పరిజ్ఞాన పరిశోధన కేంద్రం, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement