Madhumita Shah: తాను నిలబడి.. వేలాది మందిని నిలబెడుతుంది

Madhumita Came Out From-House-Dowry Created Big-Brand-Woodcraft Jharkhand - Sakshi

జార్ఖండ్‌లోని ఘట్శిలకు చెందిన మధుమితా షా అందరు ఆడపిల్లల్లానే రంగురంగుల ఊహలతో తన భర్తతో ఏడడుగులు వేసింది. అనేక ఆశలతో పశ్చిమబెంగాల్లోని అత్తారింట్లో అడుగుపెట్టింది. కొద్దిరోజులు గడిచాక అత్తారింటి వరకట్న వేధింపులతో మధుమిత కలలన్నీ కల్లలయ్యాయి. పెళ్లైన ఆరునెలల తరువాత అత్తమామలు లక్ష రూపాయలు తీసుకురమ్మని పీడించడం మొదలుపెట్టారు.

అప్పటికే కూతురి పెళ్లికి ఉన్నదంతా పోగేసి ఖర్చుపెట్టిన మధుమిత తండ్రి అంత పెద్దమొత్తంలో డబ్బులు సర్దుబాటు చేయలేకపోయాడు. పుట్టింటి పరిస్థితులను ఎంత వివరించినప్పటికీ అత్తమామలు వినేవారే కాదు.  భర్తకూడా అత్తమామలకు వంత పాడడంతో మధుమిత ఒంటరిదైపోయింది. కొన్నిరోజులపాటు వారిని బతిమిలాడి ఒప్పించడానికి ఎంతో ప్రయాసపడింది. అయినా వారి మనస్సులు కరగలేదు. పైపెచ్చు మధుమితను మరింత హింసించేవారు. దీంతో ‘‘వీరికి ఎంత ఇచ్చినా ధనదాహం తీరదు. ఇక్కడే ఉండి ఊటలా ఊరే వీళ్ల కోరికలు తీర్చలేను. వీళ్లు నన్ను మరింత హింసిస్తారు. ఇలా ఎన్నాళ్లు బాధలు పడాలి’’ అని ఆలోచించి భర్తకు విడాకులు ఇచ్చింది. 


భర్తతో విడాకులు తీసుకున్న తరువాత మధుమిత చాలా కుంగిపోయింది. పెళ్లయిన ఏడాదికే తన దాంపత్య జీవితం ముక్కలైపోవడం తట్టుకోలేక తీవ్రనిరాశ కు గురైంది. దీనికితోడు పుట్టింటికొచ్చాక చుట్టుపక్కల వాళ్లు అనే మాటలు తనని బాగా ఇబ్బంది పెట్టాయి. తన పరిస్థితిని అర్థం చేసుకోకపోగా తనదే తప్పన్నట్లు చూడడం మధుమితను మరింత బాధించేది. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం వెన్నంటే ఉండి ప్రోత్సహించేవారు. దీంతో మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారైంది.  

కీ రింగ్స్‌ నచ్చడంతో... 
అది 2014 మధుమిత ఓ రోజు జంషెడ్‌పూర్‌ వెళ్లింది. రోడ్డుపక్కన కొంతమంది చెక్కతో తయారు చేసిన  కీ రింగ్స్‌ను అమ్మడం చూసింది. చెక్కతో అనేక అక్షరాలు, వివిధ రకాల బొమ్మల ఆకారంలో ఉన్న కీ రింగ్స్‌ మధుమితను బాగా ఆకర్షించాయి. రిటైల్‌ మేనేజ్‌మెంట్లో డిప్లొమా చేసిన మధుమితకు చెక్కబొమ్మల బిజినెస్‌ చేస్తే మంచి లాభాలు వస్తాయన్న ఆలోచన వచ్చింది. వెంటనే మధుమిత గ్రామంలో తనకు తెలిసిన కొంతమంది హస్తకళాకారులను కలిసింది. వారితో మాట్లాడి చెక్కతో కీ రింగ్స్‌ తయారు చేయమని అడిగింది. మొదట్లో వాళ్లు ఒప్పుకోలేదు. తరువాత ముగ్గురు గిరిజన మహిళలు  ముందుకు రావడంతో వారికి కీ రింగ్స్‌ తయారీ నేర్పించింది. దీంతో వాళ్లు చెక్కతో రింగులు, వివిధ అలంకరణ వస్తువులు తయారు చేయడం మొదలు పెట్టారు. దీనిద్వారా ఆ మహిళలకు మంచి ఆదాయం రావడంతో మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు. 

పిపాల్‌.. 
ప్రారంభంలో చెక్కతో కీ రింగులు, ట్రేలు, పెన్‌ స్టాండ్స్‌ తయారు చేసి ఎగ్జిబిషన్‌లలో ప్రదర్శించడం, ఇంటింటికి తిరిగి విక్రయించేవారు. వీరి ఉత్పత్తులకు మంచి స్పందన లభిస్తుండంతో..ఓ ఫర్నీచర్‌ షాపు పక్కన కొద్దిగా ఖాళీస్థలం ఉంటే షాపు యజమానిని అడిగి.. 2016లో ‘పైపల్‌ ట్రీ’ పేరిట షాపు ప్రారంభించింది. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఇక్కడి నుంచే విక్రయిస్తోంది. విక్రయాలతో ఒక్కోమహిళ నెలకు సగటున పదిహేను వేల రూపాయలు చొప్పున సంపాదిస్తున్నారు. వీరంతా రెండువందలకు పైగా ఉత్పత్తులను రూపొందిస్తున్నారు. వీటిలో కోస్టర్స్, నేమ్‌ ప్లేట్స్, ఇంటి అలంకరణ వస్తువులు వంటివి ఎన్నో ఉన్నాయి. పిపాల్‌ ద్వారా వందలమందికి ఉపాధి కల్పిస్తూనే, ఏడాదికి అరవై లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్న మధుమిత ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.  

నన్ను నేను నిరూపించుకున్నాను 
మా వస్తువులకు మంచి డిమాండ్‌ ఉంది కానీ డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి చేయలేకపోతున్నాం. ఉత్పత్తులను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. నేను కాకుండా జంషెడ్‌పూర్‌లో పదహారు చోట్ల స్కూళ్లలో హ్యాండ్‌క్రాఫ్ట్‌ మేకింగ్‌ వర్క్‌షాపులు నిర్వహించి వొకేషనల్‌ ట్రైనింగ్‌ ఇస్తున్నారు. దీనిద్వారా వంటింటికే పరిమితమైన మహిళలు నెలకు ఐదు నుంచి ఏడు వేలరూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఇలా వచ్చినదానితో పిల్లల ట్యూషన్‌ ఫీజులు, రోజువారి ఖర్చులు నెట్టుకొస్తున్నారు. ప్రారంభంలో నా శక్తి సామర్థ్యాలను అంతా అనుమానించారు. కానీ ఈ మహిళలందరి సాయంతో నన్ను నేను నిరూపించుకోగలిగాను. వ్యాపారాన్ని విస్తరించి మరింతమందికి ఆర్థిక చేయూతనిస్తాను’’ అని చెబుతున్న మధుమిత ఆత్మవిశ్వాసాలు  అబ్బుర పరుస్తాయి.   

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top