కష్టకాలంలో.. కరోనా పరుపు

kerala based laxmi launcher beds for corona patients - Sakshi

ఒక సమస్య ఎదురైంది... అంటే, ఆ సమస్యకు పరిష్కారం కూడా తప్పనిసరిగా ఉండి తీరుతుంది. ఆ పరిష్కారం ఎక్కడ ఉందోననే అన్వేషణ మాత్రమే మనిషి చేయాల్సింది. కేరళలోని లక్ష్మీ మెనన్‌ ఈ కోవిడ్‌ కష్టకాలంలో పేషెంట్‌ల కోసం పరుపును కనిపెట్టింది. లక్ష్మి పర్యావరణ కార్యకర్త. ఎర్నాకుళంలో ‘ప్యూర్‌ లివింగ్‌’ సంస్థ స్థాపించారామె. ప్రకృతి వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ పర్యావరణానికి హాని కలగని జీవనశైలిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కృషి చేస్తోంది. గతంలో వేస్ట్‌ పేపర్‌తో పెన్నుల తయారీ వంటి ప్రయోగాలు చేసింది. ఇప్పుడు సమాజహితమైన శయ్యలకు రూపకల్పన చేసింది.

కోవిడ్‌ నేర్పిన విద్య
లక్ష్మి మెనన్‌ రూపొందించిన శయ్య (పరుపు) తయారీకి వాడే మెటీరియల్‌ కొత్తదేమీ కాదు. మనకు కోవిడ్‌తోపాటు పరిచయమైనదే. పీపీఈ (పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ )గౌన్‌ల తయారీలో ఉపయోగించే నాన్‌వోవన్‌ మెటీరియల్‌. ఈ గౌన్‌ల తయారీలో మిగిలిపోయిన నాన్‌వోవన్‌ మెటీరియల్‌తోనే పరుపును డిజైన్‌ చేసింది లక్ష్మి. ‘‘ఈ పరుపులను ఒకసారి వాడి పారేయడమే. కరోనా ట్రీట్‌మెంట్‌ పూర్తయి ఆ పేషెంట్‌ డిశ్చార్జ్‌ అయిన వెంటనే ట్రీట్‌మెంట్‌ సమయంలో పేషెంట్‌ ఉపయోగించిన పరుపును కూడా వైద్యప్రమాణాలకు అనుగుణంగా డిస్పోజ్‌ చేయడమే. పెరుగుతున్న కోవిడ్‌ కేసులకు అనుగుణంగా హాస్పిటళ్లలో సౌకర్యాలు లేవు. ఉన్న వసతులను మెరుగు పరిచి మంచాలు వేసి తాత్కాలికంగా ఏర్పాటు చేయగలుగుతున్నారు. కానీ వాటిలో ప్రతి పేషెంట్‌కీ ఒక పరుపును సిద్ధం చేయించడం సాధ్యం కావడం లేదు.

అందుకోసమే తక్కువ ఖర్చుతో తయారయ్యే శయ్య ఆలోచనను ఆచరణలో పెట్టాను. ఉదాహరణకు కేరళలో తొమ్మిది వందల పంచాయితీలలో తాత్కాలిక కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లు వెలిశాయి. ఒక్కో సెంటర్‌కు యాభై మంచాలుంటాయి. ఇనుప మంచాలనైతే పేషెంట్‌ మారిన ప్రతిసారీ శానిటైజ్‌ చేసి మళ్లీ వాడవచ్చు. పరుపును మాత్రం కొత్తది వేయాల్సిందే. ఇప్పుడున్న సంప్రదాయ పరుపులు ఒక్కసారిగా అన్నేసి తయారు కావడం కుదిరేపని కాదు. అందుకే టైలర్‌లు, పీపీఈ కిట్‌ మేకింగ్‌ యూనిట్‌ల దగ్గర పేరుకుపోతున్న స్క్రాప్‌ (పీపీఈ గౌన్‌ డిజైన్‌కు అనుగుణంగా క్లాత్‌ను కత్తిరించగా మిగిలిపోయిన చివరి ముక్కలు)తోనే ఈ ప్రయోగం చేశాను. కేరళలో రోజుకు ఇరవై వేల పీపీఈ గౌన్‌లు తయారవుతున్నాయి. వాటి స్క్రాప్‌ను వైద్య ప్రమాణాలకు అనుగుణంగా నిర్వీర్యం చేయడం ఎలాగో టైలర్లకు తెలియదు. దాంతో స్క్రాప్‌ కుప్పలుగా పేరుకుపోతోంది. ఒక చిన్న యూనిట్‌ నుంచి నేను ఆరు టన్నుల మెటీరియల్‌ సేకరించగలిగాను. ఆ మెటీరియల్‌తో రెండు వేల నాలుగు వందల శయ్యలు తయారు చేయగలిగాం. ఇన్ని మామూలు పరుపులను మార్కెట్‌లో కొనాలంటే పన్నెండు లక్షలైనా అవుతుంది.

ఇలా తయారు..!
నాన్‌ వోవన్‌ మెటీరియల్‌ ముక్కలను జడలుగా అల్లుతారు. ఆ జడలను మెలి తిప్పుతూ ఆరడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు శయ్యలను తయారు చేస్తారు. ఒక మహిళ రోజుకు ఒక శయ్యను అల్ల గలుగుతుంది. ఆ మహిళకు దినసరి వేతనంగా ఇచ్చే మూడు వందల రూపాయలనే శయ్యకు మేము పెట్టిన ధర. కరోనా కష్ట కాలం నుంచి గట్టెక్కడానికి నా వంతు సామాజిక బాధ్యతగా చేస్తున్న పని ఇది’’ అన్నారు లక్ష్మీ మెనన్‌. 
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top