ఏఐ సాంకేతికత కేవలం విద్య, ఉద్యోగాలకే పరిమితం కావడం లేదు. వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి, ముఖ్యంగా డేటింగ్ సంస్కృతిలోకి వేగంగా విస్తరిస్తోంది. ఒక నివేదిక ప్రకారం, ఎదుటివారిని ఇంప్రెస్ చేసేందుకు, తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు అవసరమైన సలహాల కోసం ఏఐ చాట్‌బాట్‌లను ఆశ్రయిస్తున్నట్లు తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాలు కోరుతున్న వారిలో 65% మంది పురుషులు ఉండగా, 60% మంది మహిళలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఒకప్పుడు ప్రేమలో సలహాలు కావాలంటే స్నేహితులను అడిగేవారు.. ఇప్పుడు అదే సలహా కోసం ఏఐని ఆశ్రయిస్తున్నారు. నచ్చిన వ్యక్తికి ఏం మెసేజ్ పం;eలి? మాటలతో ఎలా ఇంప్రెస్ చేయాలి? మొదటిసారి కలిసినపుడు ఏం మాట్లాడాలి? ఎదుటివారి స్పందనకు ఎలా బదులివ్వాలి? వంటి ప్రశ్నలకు సమాధానాల కోసం చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని పర్సనల్ అడ్వైజర్‌గా మార్చుకుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, 65 శాతం మంది పురుషులు, 60 శాతం మంది మహిళలు తమ ప్రేమను అవతలి వ్యక్తికి తెలియజేసేందుకు, పరిచయాలను మెరుగుపరుచుకోవడానికి, సంబంధాల్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు వెతకడానికి కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నట్లు స్పష్టమైంది. అంటే ఎదుటివారు పంపిన మాటల వెనుక అర్థం ఏమిటి? వారి స్పందన సానుకూలంగా ఉందా? మన సమాధానం ఎలా ఉండాలి? వంటి విషయాల్లోనూ టెక్నాలజీని సలహాదారుగా ఉపయోగించుకుంటున్నారన్నమాట.ఇది మంచిదేనా?
కృత్రిమ మేధ అనేది మనకు మాటలను మెరుగుపరచడంలో, ఆలోచనలను కంట్రోల్ చేయడంలో సహాయపడవచ్చు. అయితే ప్రేమ అంటే కేవలం సరైన మాటలు ఎంచుకోవడం మాత్రమే కాదు. ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవడం, నిజాయితీగా మాట్లాడటం, పరస్పర గౌరవం చూపించడం, నిర్ణయాలను గౌరవించడం వంటి అంశాలు ఏ సాంకేతికతకూ ప్రత్యామ్నాయం కావు. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని సలహా కోసం మాత్రమే ఉపయోగించుకోవచ్చు. కానీ మనసుకు బదులుగా దానిని ఉపయోగించడం మాత్రం మంచిది కాదు.
ఇదీ చదవండి: మందులకు గడువే కాదు..ప్లేస్ కూడా ముఖ్యమే!
కార్టూన్ ట్రెండ్!
ప్రేమ కథల పుస్తకం కనిపిస్తే ఒకప్పుడు అందమైన జంట ముఖచిత్రంపై కనిపించేది. కానీ ఇప్పుడు ఆ జంటల స్థానంలో రంగురంగుల బొమ్మలు, సరదా దృశ్యాలు, కార్టూన్ తరహా చిత్రాలు దర్శనమిస్తున్నాయి. అసలు ప్రేమ కథల పుస్తకాలు తమ రూపాన్ని ఎందుకు మార్చుకున్నాయి? .. అంటే పాఠకుల అభిరుచుల్లో మార్పు, కొత్త తరాన్ని ఆకట్టుకోవాలనే ప్రచురణకర్తల ప్రయత్నం, సామాజిక మాధ్యమాల్లో పుస్తకాలు ప్రత్యేకంగా కనిపించాలనే పోటీ.. ఇవన్నీ ఈ కొత్త ధోరణికి కారణాలుగా నిలుస్తున్నాయి. కవర్ పేజీ ఇపుడు పుస్తకంలోని స్టోరీని మాత్రమే సూచించడం లేదు.. పుస్తకం ఎవరి కోసం? దాని భావం ఏమిటి? రీడర్‌కి ఎలాంటి అనుభూతి కలిగిస్తుంది? అనే విషయాలను కూడా చెప్పే సాధనంగా మారింది. అందుకే ప్రేమ కథల్లో ప్రేమికుల చిత్రాలు తగ్గిపోయి.. బొమ్మల ప్రపంచం పెరిగింది! ముఖచిత్రం మారినా.. ప్రేమ కథలపై పాఠకుల ఆసక్తి మాత్రం తగ్గలేదు. ఒకప్పుడు ఫొటోలు ఆకర్షిస్తే.. ఇప్పుడు బొమ్మలే ప్రేమ కథలకు కొత్త రూపాన్ని ఇస్తున్నాయి!


