ఇసుక అక్రమ రవాణా
బుట్టాయగూడెం: రాష్ట్రం నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఒకపక్క సరిహద్దుల్లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ లారీలను సీజ్ చేస్తున్నప్పటికీ మరో పక్క అక్రమ ఇసుక రవాణా సాగుతోంది. కొద్దిరోజుల క్రితం సత్తుపల్లిలో, దమ్మపేటలో, జీలుగుమిల్లిలో ఏపీ నుంచి తెలంగాణ వైపు వెళ్తున్న లారీలను పట్టుకుని పోలీసులు సీజ్ చేసిన విషయం పాఠకులకు విధితమే. మళ్లీ ఆదివారం రాత్రి ఏపీ నుంచి తెలంగాణ వైపు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలను జీలుగుమిల్లి పోలీసులు దర్భగూడెం సమీపంలో పట్టుకుని సీజ్ చేశారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఎస్సై క్రాంతికుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేస్తుండగా రెండు వాహనాలు పట్టుబడినట్టు ఆయన తెలిపారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తెలంగాణ రాష్ట్రానికి తరలిస్తున్నట్లు గుర్తించి ఆ వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే ఈ సంఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశామని చెప్పారు.


