విశాఖ ఉక్కుపై ద్వంద్వ వైఖరి తగదు
పెనుగొండ : విశాఖ ఉక్కుపై ఎన్నికల ముందు చంద్రబాబు ప్రతిజ్ఞ చేసి, నేడు కార్మికులను, విశాఖ ఉక్కును అవహేళన చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కర్రి నాగేశ్వరరావు విమర్శించారు. సీఐటీయూ జిల్లా మహాసభల ముగింపు సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ సోమవారం జరిగిన సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ముందు విశాఖ ఉక్కుకు సొంత గని కేటాయించాలంటూ బీరాలు పలికారని, నేడు తెల్ల ఏనుగు అంటూ అవహేళన చేస్తున్నారని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం ఇలానే వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్‌లు తీసుకొచ్చి కార్మికుల పొట్ట కొడుతుందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు మాట్లాడుతూ డిసెంబరు 31 నుంచి జనవరి 4 వరకూ విశాఖ పట్నంలో జరగబోయే అఖిల భారత సీఐటియూ 18వ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కోశాధికారి పీవీ ప్రతాప్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


