గోసంరక్షణ శాలలో మహా శాంతి హోమం
ద్వారకాతిరుమల: శ్రీవారి గోసంరక్షణశాలలో సోమవారం ఉదయం అర్చకులు మహాశాంతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. క్షేత్రంలో ఇటీవల వరుస గో మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించి మృత్యుదోష పరిహారార్ధం, ఇకపై గో మరణాలు జరగకుండా ఉండేందుకు ఈ హోమాన్ని జరిపారు. ముందుగా అర్చకులు గోసంరక్షణశాలలో యజ్ఞకుండాన్ని ఏర్పాటు చేసి, పసుపు, కుంకుమలతో తీర్చిదిద్దారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్ఛరణల నడుమ విష్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనను నిర్వహించారు. అనంతరం వాస్తుపూజ చేసి, హోమకుండంలో అగ్నిప్రతిష్ఠాపన జరిపి, మహాశాంతి హోమాన్ని చేశారు. ఆఖరిలో అర్చకులు, ఆగమ విద్యార్థులు వేద మంత్రోచ్ఛరణలతో మహా పూర్ణాహుతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.


