అన్నదానం జమాఖర్చులపై రగడ
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసంలో అన్నదానానికి భక్తులు విరాళాలు అందించారు. ఆ అన్నదానం నిమిత్తం వచ్చిన ఆదాయం, ఖర్చులను కరపత్రాన్ని విడుదల చేశారు. విరాళాల ద్వారా రూ.10,91,500, నగదు, ఫోన్‌పేల ద్వారా రూ.17,49,937, చిల్లరగా డొనేషన్లు రూ.71,930 వచ్చారు. ఖాళీ పెరుగు డబ్బాలు, నూనె డబ్బాలు, సంచులు విక్రయించగా వచ్చిన ఆదాయం రూ.23 వేల కలిపి మొత్తం ఆదాయం రూ.29,36,367 వచ్చింది. మొత్తం ఖర్చు రూ.30,36,367గా తేల్చారు. ఉచిత అన్నదానం పెట్టడం వల్ల వచ్చిన నష్టం రూ.99,931 అని కరపత్రం విడుదల చేశారు. ఈ కరపత్రం సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో భక్తులకు పెట్టే అన్నదానం వల్ల సుమారు లక్ష నష్టం వచ్చిందని పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దాంతో దేవస్థానం గ్రూపులో పెట్టిన జమాఖర్చుల పత్రాన్ని తొలగించారు. ఈ జమాఖర్చులతో అనేక అనుమానాలు తలెత్తాయి. కిరాణా సరుకులు హోల్‌సేల్‌గా కాకుండా రిటైల్ షాపులో ఎలా కొన్నారు? వాటర్ ప్యాకెట్లు, బియ్యం హోల్‌సేల్‌గా కొన్నారా లేదా అని ప్రశ్నిస్తున్నారు. రసీదు పుస్తకాలకు రూ.8655 ఖర్చు రాసారని, బ్యానర్లు నిమిత్తం రూ. 42 వేలు ఖర్చు చేసినట్లు రాసారాని, అంత ఖర్చవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. భక్తులే వడ్డన చేశారని, మరి సప్లయర్స్ ఖర్చు ఎందుకయ్యిందని అడుగుతున్నారు. టిప్‌టాప్ షామియానా కోసం నాలుగు రోజులకు రూ. 60 వేలు ఖర్చయ్యిందా అని పలువురు ప్రశ్నలు సందిస్తుండడంతో పెట్టిన జమాఖర్చుల పత్రాన్ని ఆలయ అధికారులు తొలగించారు.


