మత్స్య కళాశాల తరగతులు ప్రారంభం
నరసాపురం రూరల్: మత్స్య కళాశాల విద్యార్థులు ఇంతవరకూ సరైన వసతులు లేక ఇబ్బందులు పడ్డారని, ఇక మీదట ఇబ్బందులు తొలగినట్లేనని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అన్నారు. సోమవారం నరసాపురం మండలం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలోని అద్దె భవనంలో తరగతులు ప్రారంభమయ్యాయి. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నరసాపురంలో ఆక్వా యూనివర్సిటీ, అనుబంధంగా ఆక్వా కళాశాలను మంజూరు చేశారు. ఇందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో నరసాపురం మండలంలోని సరిపల్లి లిఖితపూడి గ్రామాల మధ్య ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గత రెండు సంవత్సరాల క్రితం ఆక్వా కళాశాల తరగతులను అప్పటి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చొరవతో నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలోని తుపాను షెల్టర్ భవనంలో ప్రారంభించి నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు బ్యాచ్‌ల విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. మూడో బ్యాచ్ రావడం, విద్యార్థుల సంఖ్య పెరగడంతో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని అద్దెకు తీసుకుని తరగతులను అక్కడ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆక్వా యూనివర్సిటీ ఓఎస్‌డీ సుగుణ, అసోసియేట్ డీన్ కె.మాధవి, స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ విద్యాసంస్థల చైర్మన్ కొండవీటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


