దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెంలో విషాద ఛాయలు
యలమంచిలి: దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం గ్రామాలకు చెందిన 15 మంది ఆదివారం గండి పోశమ్మ ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో అంగుళూరు వద్ద ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అబ్బిరాజుపాలెం పంచాయతీ బండి వారి గట్టుకు చెందిన ఆదివారం కాండ్రేకుల నరసింహమూర్తి (40) మరణించగా, చికిత్స పొందుతూ దొడ్డిపట్ల గ్రామానికి చెందిన గెద్దాడ రాజేష్ (40) కూడా మరణించాడు. ఇద్దరి మృతదేహాలు సోమవారం అబ్బిరాజుపాలెం, దొడ్డిపట్ల గ్రామాలకు చేరుకున్నాయి. మృతదేహాలను సోమవారం ఆర్డీఓ దాసి రాజు, తహసీల్దార్ గ్రంథి పవన్‌కుమార్ సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రమాదంలో వారిలో ఇద్దరు మరణించగా మిగతా వారికి రాజమండ్రిలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారని చెప్పారు. స్వల్పంగా గాయపడిన మరొక ముగ్గురికి చికిత్స అందించి ఇంటికి పంపినట్లు వివరించారు. వాహన డ్రైవర్ కడిమి శ్రీనివాస్ దేవీపట్నం పోలీస్‌స్టేషన్ విచారణలో ఉన్నారన్నారు. ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారికి ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని వివరించారు.
దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెంలో విషాద ఛాయలు


