నిడమర్రు: సీఎం చంద్రబాబు పర్యటనలో బీసీల సమస్యలు ఆయన దృష్టికి తీసుకు వెళ్లకుండా గృహ నిర్భందం చేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నవుడు వెంకట రమణ అన్నారు. సోమవారం సాయంత్రం పత్తేపురంలోని ఆయన నివాసంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణకు, అభివృద్ధికి బీసీ డిక్లరేషన్ పేరుతో ప్రత్యేక చట్టంతో రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని హామీలు గుప్పించి. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయిన ఆదిశగా ఒక్క అడుగు పడలేదన్నారు. బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి నేడు రిక్త హస్తం చూపించారన్నారు. బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛన్ అని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ హామీ అటకెక్కినట్లేనా అన్నారు. టీడీపీలో ఉన్న బీసీ నాయకులంతా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని బీసీ విభాగం అభివృద్ధి కోసం తిరుగుబాటు చేయాలని సూచించారు. గొల్లగూడెం వస్తున్న చంద్రబాబును కలిసేందుకు పలువురు బీసీ నేతలతో వెళుతున్న వెంకట రమణను నిడమర్రు పోలీసులు పత్తేఫురంలోని ఆయన నివాసంలో సోమవారం హౌస్ అరెస్ట్ చేశారు.


