దిత్వాగుబులు
50 శాతం మాసూళ్లు
మొక్కజొన్న, మామిడికి నష్టం
● మేఘావృతం.. చిరుజల్లులు
● అన్నదాతల కలవరం
● పంటను కాపాడుకునేందుకు పాట్లు
గణపవరం/నూజివీడు : దిత్వా తుపాను బలపడుతూ తీరానికి దగ్గరగా వస్తుండటంతో పాటు ఆకాశం మేఘావృతమై ఉండటంతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పంట చేతికందే సమయంలో తుపాను హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఇప్పటికే వేసిన కుప్పల్లోకి వర్షం నీరు దిగకుండా పాలిథీన్ కవర్లు, ప్లాస్టిక్ కవర్లు కప్పుతున్నారు. మరికొందరు రైతులు కోతకు వచ్చిన వరి పంటను కోయకుండా వాయిదా వేసుకుంటుండగా, మరికొందరు యంత్రాలతో కోతలు నిర్వహిస్తున్నారు. కొందరు రైతులు నాలుగురోజుల నుంచి వరి గడ్డి లేకపోయినా, పంట చేతికొస్తే చాలనే భావనతో మెషీన్లతో కోతలు కోయిస్తున్నారు. కూలీల కొరతతో కొందరు వరి పనలు కుప్ప వేయకుండా అలాగే ఉంచారు.
20 వేల ఎకరాల్లో..
నూజివీడు నియోజకవర్గంలో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో కలిపి 20 వేల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగుచేశారు. నూజివీడు మండలంలో 2,500 ఎకరాలు, ముసునూరు మండలంలో 3,500 ఎకరాలు, ఆగిరిపల్లి మండలంలో 6 వేల ఎకరాలు, చాట్రాయి మండలంలో 8 వేల ఎకరాల్లో సాగుచేశారు. దీనిలో 50 శాతానికి పైగా వరి కోతలు కోయగా మిగిలిన పంట కొంత పనలపైన, మరికొంత కోయకుండా ఉంది. తుపాను హెచ్చరికలతో శని, ఆదివారాల్లో రైతులు హడావుడిగా కుప్పలు వేశారు. కుప్పలు వేయడానికి కుదరకుంటే పనలు, కంకులు పాడవకుండా వాటిపై ఉప్పునీళ్లు చల్లుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
ఉంగుటూరు నియోజకవర్గంలో దాదాపు 50 శాతం మాసూళ్లు పూర్తయ్యాయి. మిగిలిన విస్తీర్ణంలో కోతలు, నూర్పిళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. భీమడోలు, ఉంగుటూరు మండలాల్లో మూడు వంతులకు పైగా కోతలు పూర్తికాగా, గణపవరం, నిడమర్రు మండలాల్లో కోతలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. తుపాను హెచ్చరికలతో ఆదివారం మధ్యాహ్నం నుంచే చిరుజల్లులు పడటంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పాట్లుపడుతున్నారు. చాలా మంది రైతులు ధాన్యాన్ని ఎండబెట్టి రాశులు చేసి ఉంచారు. కొందరు రైతులు దళారులకు బస్తా రూ.1,380 చొప్పున విక్రయిస్తున్నారు. నియోజకవర్గంలో సుమారు 22 వేల హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేయగా 12 వేల హెక్టార్లలో కోతలు, మాసూళ్లు పూర్తయ్యాయి. యంత్రాలతో కోతల వల్ల తేమ శాతం ఉండటంతో ధాన్యాన్ని రోడ్డు, పుంతల వెంబడి ఆరబెడుతున్నారు. ఇదిలా ఉండగా ఎకరాకు 30 బస్తాలకు మించి దిగుబడి రాకపోవడంతో ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు నష్టం తప్పదని అంటున్నారు.
ముసురు వాతావరణం మామిడికి నష్టమేనని రైతులు అంటున్నారు. మామిడిలో పూతలు రావాలంటే రాత్రిపూట చలి, పగటి పూట వేడి వాతావరణం ఉండాలి. ముసురుతో తోటల్లో తెగుళ్లు వ్యాపిస్తాయని, పూతలు ఆలస్యమవుతాయని అంటున్నారు. అలాగే రైతులు మొక్కజొన్న పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. రెండు రోజుల నుంచి 15 రోజుల దశలో పంట ఉంది. కొన్నిచోట్ల రెండు రోజులుగా విత్తనాలను నాటుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారీ వర్షాలు పడితే పంట దెబ్బతింటుందని అంటున్నారు.
దిత్వాగుబులు
దిత్వాగుబులు
దిత్వాగుబులు


