ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో ఆన్‌లైన్ సేవలు విస్తృతం కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల అధికారులతో ఈనెల 29న ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయాల్లో ఆన్‌లైన్, డిజిటల్ సేవలను విస్తృతపరిచే అంశాలపై చర్చించారు. కమిషనర్ ఉత్తర్వుల్లోని నియమ నిబంధనల ప్రకారమే నెయ్యి కొనుగోలు చేయాలని, ఆన్‌లైన్ ద్వారా దర్శనం టికెట్లు పొందిన భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనం ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా ప్ర సాదాలు కొనుగోలు చేసేవారికి ప్రత్యేక కౌంట ర్ ద్వారా త్వరితగతిన వాటిని అందించే ఏ ర్పాట్లు చేయాలన్నారు. భద్రతలో భాగంగా ఆలయాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించవద్దన్నారు. పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాల కల్పనలో చినవెంకన్న దేవస్థానం 3వ స్థానంలో ఉందని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని సూ చించారు. ముఖ్యంగా మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, సెంటెడ్ ఫినా యిల్ వాడేలా చూడాలన్నారు. నిత్య కల్యాణాలు, ప్రసాదాలు, దర్శనం టికెట్లు, ఆర్జిత సేవలు పొందే భక్తులు ఆన్‌లైన్ సౌకర్యాన్ని వినియోగించేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు.
సేవలు సులభతరం
భక్తులు స్వామివారి దర్శనం, వసతి, డొనేషన్లు, కేశఖండన, ప్రసాదాలు, ఇతర సేవా టికెట్ల బుకింగ్ కోసం ఆన్‌లైన్ (వెబ్‌సైట్), వాట్సాప్ సేవలను వినియోగించుకోవాలని ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి సూచించారు. httpr:// www.aptemples.org వెబ్‌సైట్ ద్వారా, మన మిత్ర వాట్సాప్ +91 9552300009 ద్వారా సులభంగా సేవలు పొందవచ్చన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బీసీల రక్షణ, అభివృద్ధికి బీసీ డిక్లరేషన్ పేరుతో ప్రత్యేక చట్టంతో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకట రమణ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా బీసీలకు ఇచ్చిన హామీలు ఎక్కడా అని నిలదీశారు. బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి రిక్తహస్తం చూపారన్నారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ హామీని అటకెక్కించారన్నారు. స్థానిక సంస్థలు, నామినేషన్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు హామీ ఏమైందని, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పిన హామీ కూడా గాలిలో కలిపేశారన్నారు. దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు ఇస్తామని చెప్పి అన్యాయం చేశారన్నారు. స్వయం ఉపాధికి రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయలేదని, రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకాన్ని పునరుద్ధరించలేదన్నారు. బూటకపు హామీలతో మో సం చేసిన చంద్రబాబుకు బీసీలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీసీలు ఉప ముఖ్యమంత్రి పదవికి పనికిరారా అని ప్రశ్నించారు. టీడీపీ ద్వారా బీసీలకు రాజ్యాధికారం భ్రమ మాత్రమే అని, అభివృద్ధి కలే అన్నారు. బీసీలకు సామాజిక న్యాయం పచ్చి అబద్ధమన్నారు. టీడీపీలో ఉన్న బీసీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. టీడీపీ, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు చేస్తున్న అన్యాయానికి, అణచివేతకు, దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడుదామని నౌడు పిలుపునిచ్చారు.
ఏలూరు(మెట్రో): జిల్లాలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని డీఆర్వో వి.విశ్వేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా కలెక్టర్, జేసీ అందుబాటులో ఉండరని, డీఆర్వో, ఇతర అధికారులు వినతులు స్వీకరిస్తారన్నారు.
పెదవేగి: రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ ఆ లయంలో ఆదివారం విశేష పూజలు జరిగా యి. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయానికి పూజా రుసుం ద్వారా రూ.26,270, విరాళాల రూపంలో రూ.700, లడ్డూ విక్రయం ద్వారా రూ.12120, ఫొటోల అమ్మకంపై రూ.1,375 మొత్తంగా రూ.40,465 ఆదాయం లభించిందని దేవస్థానం ఈఓ ఎన్.సతీష్‌కుమార్ తెలిపారు.
శ్రీవారి క్షేత్రంలో ఆన్‌లైన్ సేవలు విస్తృతం


