ఏలూరు ద్వారకానగర్‌లో చోరీ
ఏలూరు టౌన్: ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతంలోని ద్వారకానగర్ ఇంట్లో బంగారు, వెండి వస్తువులను దొంగలు అపహరించుకుపోయారు. రూరల్ ఎస్‌ఐ నాగబాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శొంఠి వెంకట సుబ్రహ్మణ్యం ఈనెల 21న కుటుంబంతో కలిసి విజయవాడలోని తమ బంధువుల ఇంటికి వెళ్ళారు. ఇంటికి సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఈనెల 28న రాత్రి తన ఫోనును పరిశీలించారు. సీసీ కెమెరాలు ఫోన్‌కు అనుసంధానం చేసి ఉండడంతో వాటిని చూడగా... కెమెరాలు పక్కకు తిప్పేసి ఉన్నాయి. వెంటనే సుబ్రహ్మణ్యం ఏలూరులోని ఇంటికి వచ్చి చూడగా బీరువాను పగులగొట్టి ఉంది. బీరువాలోని పావుకిలో వెండి వస్తువులు, మూడున్నర కాసుల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముదినేపల్లి రూరల్: మండలంలోని పెదపాలపర్రు గంగానమ్మ గుడికి చెందిన హుండీలో నగదు చోరీ జరిగింది. దీనిపై కమిటీ అధ్యక్షుడు ఎలిశెట్టి లక్ష్మీనరసింహరావు స్థానిక పోలీసుస్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. ఆలయం వద్ద ఆదివారం గంగానమ్మ సంబరం జరగనుంది. దీని నిమిత్తం ఆలయానికి వెళ్లగా ఆవరణలో ఏర్పాటుచేసిన హుండీని పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు నగదును దొంగిలించినట్లు ఫిర్యాదు చేయగా ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్వారకాతిరుమల: ఓ వ్యక్తి ద్వారకాతిరుమలలో శనివారం కొండచిలువతో హల్‌చల్ చేశాడు. స్థానిక కిచ్చయ్య చెరువులో వలలో పడి, మృతి చెందిన కొండ చిలువను గ్రామానికి చెందిన పెయింటర్ లాజర్ మద్యం మత్తులో మెడలో వేసుకున్నాడు. అనంతరం శ్రీవారి దేవస్థానం సంస్కృతోన్నత పాఠశాలలోకి వెళ్లి దాంతో విన్యాసాలు చేశాడు. విద్యార్థులు బయపడటంతో ఉపాధ్యాయులు అతడిని బయటకు పంపివేశారు. ఆ తరువాత ఆ పాముతో గుడి సెంటర్‌లో తిరిగాడు. మెడలో వేసుకుని పలు దుకాణాల వద్ద కుర్చున్నాడు. అయితే వ్యాపారులు అతడిని హెచ్చరించి, దూరంగా పంపేశారు.
వీరవాసరం: వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డిసెంబర్ 2 నుంచి 4 వరకు ఆంధ్రప్రదేశ్ 69వ స్కూల్ గేమ్స్ అండర్ 17 రాష్ట్రస్థాయి బాలబాలికల సాఫ్ట్‌బాల్ అంతర జిల్లాల టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ అధ్యక్షులు జుత్తిగ శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి 13 జిల్లాల బాల బాలికల జట్ల నుంచి సుమారు 416 మంది క్రీడాకారులు 52 మంది కోచ్, మేనేజర్లు పాల్గొంటారన్నారు.
ఏలూరు రూరల్: డిసెంబర్ 4 నుంచి 6 వరకూ కర్నూలు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ 11వ సీనియర్ పురుషుల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి కె.అలివేలు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పురుషుల జట్టును డిసెంబర్ 1న ఎంపిక చేస్తామని వెల్లడించారు. వీరవాసరం మండలం కొణితివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాయంత్రం 3 గంటలకు జట్టు ఎంపిక పోటీలు జరుగుతాయని వివరించారు.
ఏలూరు (టూటౌన్): పాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలను కలిపి ప్రత్యేక గిరిజన జిల్లాగా ఏర్పాటు చేయాలని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక పవరుపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాల పునర్విభజనలో ప్రజల అభీష్టం మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు. గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చింతూరు, రంపచోడవరం, పోలవరం ప్రాంతాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఏలూరు ద్వారకానగర్‌లో చోరీ


