పరిహారం ఎప్పుడు జమ చేస్తారు ?
కుక్కునూరు: పోలవరం ప్రాజెక్ట్ 41.15 కాంటూర్ పరిధిలో ముంపునకు గురవుతున్న కివ్వాక గ్రామానికి సంబంధించి 106 మంది నిర్వాసితులకు ఇంటి పరిహారం ఎప్పుడు జమచేస్తారో తేల్చాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. మండలంలో మొత్తం 8 గ్రామాలను ప్రాజెక్ట్ 41.16 కాంటూర్ పరిధిలో పేర్కొనగా ఇటీవల అయా గ్రామాలకు ఆర్ అండ్ ఆర్, కుటుంబ, స్ట్రక్చర్ వాల్యూ పరిహారాన్ని నిర్వాసితుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. 41.15 కాంటూర్ పరిధిలో పేర్కొన్న కివ్వాక గ్రామంలో మొత్తం 106 మంది నిర్వాసితుల పేర్లు స్ట్రక్చర్ వాల్యూ జాబితా నుంచి గల్లంతయ్యాయి. దీంతో పేర్లు గల్లంతయిన నిర్వాసితులు వారి పేర్లను పంచాయతీ సర్పంచ్‌తో తీర్మానం చేయించి తగిన ఆధారాలతో సహా అధికారులకు సమర్పించారు. ఇది జరిగి సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు నిర్వాసితులకు న్యాయం జరగలేదు. ఆర్ అండ్ ఆర్ సర్వే అనంతరం అధికారులు పంచాయతీ కార్యాలయాల్లో ప్రకటించిన మొదటి రెండు జాబితాల్లో ఉన్న పేర్లు పరిహారం చెల్లింపులు వచ్చేసరికి ఎలా మిస్సవుతాయని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది చేసిన తప్పుకు తాము శిక్ష అనుభవించాలా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని జిల్లా కేంద్రంలోని పోలవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా కలెక్టర్‌కు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. ఆర్ అండ్ ఆర్ కుటుంబ ప్యాకేజీ ఇచ్చి ఇళ్ల పరిహారం విషయంలో తమకు న్యాయం చేయకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారో అర్థం కావడంలేదని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


