ఏలూరు జిల్లా పేరు మార్చాలి
జిల్లా యంత్రాంగానిదే బాధ్యత..
వసూలుకు చర్యలు చేపట్టాలి
పుస్తకాలు కొనేందుకు డబ్బుల్లేవు
● రూ.30.54 కోట్లకు పేరుకుపోయిన సెస్సు
● శిధిలావస్థలో జిల్లా కేంద్ర గ్రంథాలయం
● నూతన భవన నిర్మాణానికి నిధుల కొరత
జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా పేరును గోదావరి లేదా ఉత్తర గోదావరి జిల్లాగా మార్చాలని ఏలూరు జిల్లా వాసులు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, వామపక్షాలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు ఉత్తరంగా గోదావరి ప్రవహిస్తోందని, జిల్లా వాసులకు గోదావరితో విడ దీయరాని అనుబంధం ఉందన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా జిల్లాలు, జిల్లా పేరు మార్పులు జరుగుతున్నాయని, ఏలూరు జిల్లా పేరు మార్పు చేయాలని తీర్మానం చేశారు. ఉత్తర గోదావరి జిల్లా పేరు కోసం కమిటీ వేస్తామని నిర్ణయించారు. ఉద్యమాన్ని సోషల్ మీడియా ద్వారా ఇతర విధానాల్లో ముందుకు తీసుకెళ్లాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తీర్మానించారు. మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన మల్లాది సీతా రామలింగేశ్వర రావు, కొప్పాక శ్రీనివాసు, ఈసుపాటి వెంకట రామలక్ష్మి, దాసరి చంద్రశేషు, ముస్తఫా, పరిమి సత్తిపండు, రాజాన సత్యనారాయణ (పండు), పెనుమర్తి రామకుమార్, నంబూరి రామచంద్రరాజు, గుమ్మడి ప్రసాద్, బొబ్బరపాల్, కన్నా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రగంథాలయాలకు
బకాయిల భారం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు.. దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించాయి. ఈ నెల 14 నుంచి 20 వరకూ జరిగిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇవే మాటలు పదేపదే చెప్పారు. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రంథాలయ సంస్థ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. ఈ సంస్థకు స్థానిక సంస్థల నుంచి రావాల్సిన సెస్సు బకాయిలు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది.
గ్రంథాలయల అభివృద్ధికి సంబంధించిన అవసరమైన నిధుల్లో ఎక్కువ శాతం సెస్సుల ద్వారానే రావాల్సి ఉంటుంది. నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు, పంచాయతీలు వంటి స్థానిక సంస్థలు ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల్లో 8 శాతం గ్రంథాలయ సెస్సుగా వసూలు చేస్తున్నాయి. అలా వసూలు చేసిన సెస్సుల్లో గ్రంథాలయాలకు రావాల్సిన వాటా మొత్తం గ్రంథాలయ సంస్థకు చెల్లించడం లేదు. ఈ మేరకు మ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో జిల్లా గ్రంథాలయ సంస్థకు స్థానిక సంస్థలు చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ.30.54 కోట్లకు పైగా పేరుకుపోయాయి. వీటిలో సింహభాగం ఒక్క ఏలూరు నగర పాలక సంస్థదే. ఈ మేరకు ఏలూరు నగరపాలక సంస్థ జిల్లా గ్రంథాలయ సంస్థకు రూ.14,35,66,061 బకాయి పెట్టింది. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు కలిపి మరో రూ.10 కోట్లు, భీమవరం మున్సిపాలిటీ రూ.1,98,41,730 బకాయిపడింది. వీటితో పాటు కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు మున్సిపాలిటీలు రూ.50 లక్షలకు పైగానే బకాయిలు పెట్టాయి.
శిధిలావస్థలో జిల్లా గ్రంథాలయం
ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించే గ్రంథాలయాల్లో ప్రధానంగా జిల్లా కేంద్ర గ్రంథాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. భవనంలో అక్కడక్కడా పెచ్చులూడి పాఠకులపై పడుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రోజుకు సుమారు 500కు పైగా పాఠకులతో కళకళలాడుతూ ఉండే జిల్లా కేంద్ర గ్రంథాలయానికి ప్రస్తుతం పాఠకులు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ భవనంలోని వివిధ విభాగాలను ఇప్పటికే సంబంధిత అధికారులు మూసివేసి కొద్దిగా బాగున్న గదుల్లో గ్రంథాలయాన్ని నిర్వహిస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. ఈ గ్రంథాలయ భవనం శిథిలావస్థలో ఉంది. పాఠకులు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెబుతూ ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు వేయడం చూస్తే జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనం ఎంత దుస్థితిలో ఉందో అర్థమవుతోంది.
నూతన భవన నిర్మాణానికి అనుమతులు
శిథిలావస్థలో ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని గత కొన్నేళ్ళుగా గ్రంథాలయ సంస్థ అధికారులకు మొరపెట్టుకుంటున్నా వారి నుంచి పెద్దగా స్పందన లభించేది కాదు. నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.2.99 కోట్లతో చేసిన ప్రతిపాదనలు బుట్ట దాఖలవుతూ వస్తున్నాయి. పదేపదే దీనిపై చేసిన ప్రాతినిధ్యం ఫలించి ఎట్టకేలకు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ నూతన భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా అనుమతులు మంజూరైన తరువాత నూతన భవన నిర్మాణం ప్రారంభించడానికి ప్రయత్నించగా గ్రంథాలయ సంస్థ కోశాగారం ఖాళీగా ఉంది. బకాయిపడ్డ సెస్సు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సిన దుస్థితి ఎదురైంది.
జిల్లా కేంద్ర గ్రంథాలయం పూర్తిగా శిథిలమైంది. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చనే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నూతన భనవ నిర్మాణానికి అనుమతులు మంజూరైన నేపధ్యంలో ముందుగా ప్రస్తుత గ్రంథాలయాన్ని యుద్ధ ప్రాతిపదికపై వేరొక భవనంలోకి తరలించే ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేయాలి. అనుకోని ప్రమాదం సంభవించి ప్రాణనష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అదే జరిగితే జిల్లా యంత్రాంగం మొత్తం బాధ్యత వహించాల్సి వస్తుంది.
– లేళ్ళ వెంకటేశ్వర రావు,
గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి
రూ. 30 కోట్లకు పైగా సెస్సు బకాయిలను వసూలు చేయడానికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలి. గతంలో ఆర్థిక సంఘం నిధుల్లోంచి విద్యుత్ బిల్లులు, గ్రంథా లయ సెస్సుల బకాయిలు చెల్లించేవారు. ప్రస్తుతం ఆర్థిక సంఘ నిధులు పంచాయతీల ఖాతాల్లో జమయినట్టుగా తెలుస్తోంది. వాటి నుంచి సెస్సు బకాయిలు చెల్లించేలా చర్యలు చేపట్టాలి. గ్రంథాలయాల అభివృద్ధికి సంబంధించి సామాజికవేత్తలు, రచయితలు, సాహితీవేత్తలకు భాగస్వామ్యం కల్పించాలి.
– నాగాస్త్ర, జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి
గ్రంథాలయ సంస్థ నిధుల లేమితో సతమతమౌతోంది. పాఠకులకు మంచి పుస్తకాలు కొనాలన్నా, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కావాల్సిన స్టడీ మెటీరియల్ కొనాలన్నా నిధులు లేమి వెక్కిరిస్తోంది. కొన్ని స్థానిక సంస్థలు కొద్దోగొప్పో సెస్సు బకాయిలు చెల్లిస్తున్నా అవి సిబ్బంది జీతాలకే సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది. ఇటీవల నిర్వహించిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు సంబధించి చేయాల్సిన చెల్లింపులు సైతం చేయలేక వారికి సమాధానం చెప్పలేక గ్రంథాలయ సంస్థ అధికారులు సతమతమవుతున్నారు.
ఏలూరు జిల్లా పేరు మార్చాలి
ఏలూరు జిల్లా పేరు మార్చాలి
ఏలూరు జిల్లా పేరు మార్చాలి


