డీజిల్ దొంగల అరెస్ట్
జంగారెడ్డిగూడెం: డీజిల్ దొంగలను శుక్రవారం జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ వివరాలు వెల్లడించారు. ఇటీవల లారీల్లోని డీజిల్ దొంగతనాలు చోటు చేసుకోవడం, బాధితుల ఫిర్యాదులతో తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. ఈ నేపథ్యంలో 27వ అర్ధరాత్రి మండలంలోని జాతీయ ప్రధాన రహదారి రామచర్లగూడెం చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా పీసీ చిట్టిబాబు డ్రోన్ కెమేరాతో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారన్నారు. ఈ క్రమంలో జీలుగుమిల్లి వైపు నుంచి వస్తున్న కారు పోలీసులను చూసి వెనుదిరగడాన్ని గుర్తించి, వెంటనే వెంబడించి అడ్డుకున్నామన్నారు. కారులోని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా లారీల్లో డీజిల్ చోరీ చేస్తున్నట్లు అంగీకరించారన్నారు. నిందితులు చోరీ చేసిన డీజిల్‌ను అమ్మి వచ్చిన సొమ్ముతో జూదక్రీడలకు పాల్పడుతున్నారన్నారు. నిందితులు ముగ్గురూ పల్నాడు జిల్లాకు చెందిన వారని, వీరు పలు జిల్లాల్లో డీజిల్ దొంగతనాలు చేసినట్లు ఎస్సై తెలిపారు. నిందితుల నుంచి 30 లీటర్ల 1 డీజిల్ డబ్బా, 7 ఖాళీ డబ్బాలు, డీజిల్ చోరీకి వినియోగించే 30 మీటర్ల పచ్చరంగు పైపు, డ్రైవర్‌ను బెదిరించడానికి ఉపయోగించిన 4 అంగుళాల బ్లేడ్ ఉన్న చాకు, కారు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. నిందితులను అరెస్టులో ప్రతిభ చూపిన ఎస్సై ఎన్‌వీ ప్రసాద్, ఏఎస్సై ఎన్‌వీ సంపత్‌కుమార్, హెచ్‌సీ యు.ఉమామహేశ్వరరావు, పీసీలు సీహెచ్ చిట్టిబాబు, కె.శివాజీ, దిలీప్, ఈ.కిషోర్, యు.రవికుమార్‌లను ఏఎస్పీ సుస్మిత రామనాథన్, సీఐ ఎంవీ సుభాష్ అభినందించారు.
నూజివీడు: టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆక్రమణల పర్వం ఇష్టారాజ్యంగా సాగుతోంది. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. మండలంలోని దేవరగుంటలో అక్రమార్కులు రెవెన్యూ భూమిని యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. గత కొద్దిరోజులుగా జేసీబీలతో గట్టుపైన ఉన్న అటవీ ప్రాంతాన్ని అంతా తొలగిస్తున్నా రెవెన్యూ అధికారులు గానీ, వీఆర్వో గాని అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దేవరగుంటలో చింతలగట్టు పేరుతో ఆర్‌ఎస్ నెంబరు 1లో దాదాపు 259 ఎకరాల రెవెన్యూకు సంబంధించిన కొండ పోరంబోకు భూమి ఉంది. అధికార పార్టీ నాయకుల అండతో కొందరు దాదాపు 50 ఎకరాల రెవెన్యూ భూమిని ఆక్రమించేస్తున్నారు. ఈ ఆక్రమణలపై గ్రామానికి చెందిన పలువురు శుక్రవారం సబ్‌కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నకు ఫిర్యాదు చేశారు. ఇష్టారాజ్యంగా అటవీ ప్రాంతాన్ని ఇలా నరికేస్తే గ్రామంలోని గొర్రెలు, మేకలు, పశువులకు మేత దొరకకుండా పోయే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆక్రమిస్తే చర్యలు తప్పవు
దేవరగుంటలోని సర్వే నెంబరు 1లోని కొండ పోరంబోకు భూమిని ఆక్రమిస్తున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందని నూజివీడు తహసీల్దార్ గుగులోతు బద్రూ తెలిపారు. వీఆర్వోను పంపించి ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
దెందులూరు: చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న వాహనాన్ని దెందులూరు ఎస్సై ఆర్ శివాజీ శుక్రవారం సీజ్ చేశారు. హైదరాబాదు నుంచి శ్రీ పర్రు గ్రామానికి చికెన్ వ్యర్థ పదార్థాలను వాహనాన్ని సొమవరప్పాడు వద్ద పట్టుకుని సీజ్ చేశామని, దీనికి సంబంధించి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
డీజిల్ దొంగల అరెస్ట్


