సోషల్ ఆడిట్‌ల ద్వారా అభ్యసనా సామర్థ్యాల మెరుగు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పాఠశాలల్లో సోషల్ ఆడిట్లు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు మెరుగుపడడంతో పాటు వారిలో విద్యా నైపుణ్యాలు పెంపొందుతాయని సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే. పంకజ్ కుమార్ అన్నారు. జిల్లా స్థాయి సాల్ట్ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక సుబ్బమ్మాదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో క్లస్టర్ రీసోర్స్ మొబైల్ టీచర్స్ (సీఆర్‌ఎంటీ)లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పంకజ్ కుమార్ మాట్లాడుతూ సీఆర్‌ఎంటీలు పాఠశాలల స్థితిగతులను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అందుకు సంబంధించిన వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ మాట్లాడు తూ సోషల్ ఆడిట్ కార్యక్రమాన్ని సీఆర్‌ఎంటీలు విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ ఏఎంఓ ఆర్.రామారావు, సీఎంఓ డీ.యెహోషువా, ఏఎల్‌ఎస్‌సీఓ సొంగా నాగేశ్వరరావు, ఏఎస్‌ఓ ఆర్.రామకృష్ణారావు పాల్గొన్నారు.


