పెద్దింట్లమ్మ దేవస్థానం భూముల కబ్జా!
అవి దేవస్థాన భూములు కావు
కై కలూరు: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రెవెన్యూ అధికారులు భూ కబ్జాలపై ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నారని విమర్శలు సర్వత్రా వినిపిస్తోన్నాయి. నియోజకవర్గంలో ఇప్పటికే ఇరిగేషన్, డ్రెయినేజీ భూములను విచ్చలవిడిగా ఆక్రమిస్తున్నారు. తాజాగా అక్రమార్కుల కన్ను జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థాన ఆవరణ భూములపై పడింది. అమ్మ దర్శనానికి వచ్చే భక్తుల నుంచి గదుల రూపంలో అద్దెలు వసూలు చేయడానికి అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారు.
వైఎస్సార్ సీపీ హయాంలో ఆక్రమణల తొలగింపు
కొల్లేటికోట దేవస్థానం 2.10 ఎకరాల్లో విస్తరించి ఉంది. పూర్వం ఎకరం స్థలాన్ని స్థానిక వ్యాపారులు ఆక్రమించారు. దుకాణాలను ఏర్పాటు చేసుకుని అమ్మ దర్శనానికి వచ్చే భక్తుల నుంచి అడ్డగోలుగా దోపిడి చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) దేవస్థానం వద్ద ఆక్రమణలను తొలగించారు. సమీప జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా దాతల సాయంతో అతి పెద్ద అనివేటి మండపాన్ని నిర్మించారు. ఆక్రమణదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ భక్తులను దృష్టిలో పెట్టుకుని డీఎన్నార్ పనులు చేయించారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులను అందరూ సమర్థించారు. అనంతరం దేవస్థానంలో నిర్మించిన గోడను చంద్రబాబు ప్రభుత్వంలో పగలగొట్టి వ్యాపారుల కోసం అడ్డగోలుగా గేటు ఏర్పాటు చేయడం విమర్శల పాలైంది.
దోచుకోడానికి సన్నద్ధం
కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంకు ప్రతి ఆదివారం వేలల్లో భక్తులు వస్తారు. జాతర సమయంలో భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. దేవస్థానం తరుపున 12 గదులు మాత్రమే ఉన్నాయి. ఇవి ఏ మాత్రం భక్తులకు సరిపోవడం లేదు. దీంతో దేవస్థానం సమీపంలో ప్రభుత్వ భూముల్లో అడ్డగోలుగా సుమారు 80 గదులను నిర్మించారు. ఒక్కో ఏసీ గదిని వంట షామియానాతో కలుపుకుని రూ.5 వేల నుంచి రూ.6 వేలకు ఆదివారం రోజున అద్దెకు ఇస్తున్నారు. ఆదాయం బాగా రావడంతో మిగిలిన అక్రమార్కులు కొద్ది రోజులుగా దేవస్థానం సమీపంలో 6 ఇళ్లకు స్తంభాలు పాతారు. వీరికి కొల్లేరు పెద్దల్లో కొందరు సహాకరిస్తున్నారు. తొలగిస్తే అక్రమాలు అన్ని తొలగించాలని మెళిక పెడుతున్నారు. ఆక్రమలపై రెవెన్యూ, ఫారెస్టు అధికారులు పట్టించుకోవడం లేదు.
పెద్దల పంచాయితీ
దేవస్థాన సమీపంలో అక్రమ నిర్మాణాలపై నాలుగు రోజుల క్రితం పందిరిపల్లిగూడెం చావిడి వద్ద పెద్దల పంచాయితీ జరిగింది. అక్రమార్కులు మా పనులు ఆపితే అందరి ఆక్రమణలు తొలగించాలని వాదించారు. చివరకు పెద్దలు భక్తుల సౌకర్యార్థం గ్రామం తరుపున గదులు నిర్మించి 60 శాతం పంచాయతీ అభివృద్ధికి, 40 శాతం దేవస్థానంకు చెల్లించే విధంగా ప్రణాళిక రూపొందిద్దామని నిర్ణయించారు. పూర్వం నుంచి దేవస్థానం వద్ద జీవనోపాధి పొందుతున్న వ్యాపారులకు సమీపంలో స్థలాలు అందించారని, కొత్త వ్యక్తులు ఆక్రమణలు చేయవద్దని కోరారు. దీనిపై మరోసారి సమావేశం నిర్వహిస్తామని నిర్ణయించారు.
కొల్లేటి పెద్దల అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు
ఇళ్లు నిర్మించి భక్తులకు అద్దెకు ఇవ్వడానికి పన్నాగం
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
ఆక్రమణలపై పందిరిపల్లిగూడెంలో పంచాయితీ
పెద్దింట్లమ్మ దేవస్థానంకు కేటాయించిన చెందిన భూమి చుట్టూ ప్రహరీ నిర్మించాం. అక్రమ నిర్మాణాలు అనేవి ప్రహరీ బయట జరిగే అవకాశం ఉంది. దేవస్థాన భూముల్లో ఎటువంటి అక్రమ నిర్మాణాలకు తావు లేదు. దేవస్థానం గదులు 12 మాత్రమే ఉన్నాయి. అమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం.
– కూచిపూడి శ్రీనివాసు, ఆలయ ఈవో, కొల్లేటికోట
పెద్దింట్లమ్మ దేవస్థానం భూముల కబ్జా!


