అక్కిరెడ్డిగూడెంలో భారీ చోరీ
ముసునూరు: అక్కిరెడ్డిగూడెంలో తాళాలు వేసి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.60 వేల నగదు, 11 కాసుల బంగారం అపహరించుకు పోయిన ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అక్కిరెడ్డిగూడెంలో పైడిపాముల ఎబినేజర్, సుందర్‌సింగ్ అన్న దమ్ములు. వీరి కుటుంబ సభ్యులందరూ ఇంటి ఎదురుగా ఉన్న చర్చిలో సోమవారం రాత్రి ప్రార్థనలకు వెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి ఇండ్లలోకి ప్రవేశించి, బీరువాలు పగలగొట్టి, చోరీకి పాల్పడ్డారు. ప్రార్థనలు ముగించుకుని, యజమానులు ఇంట్లోకి వస్తుండడం చూసి, ఇంటి వెనుక నుంచి పారి పోయారు. ఇంట్లోకి చేరుకున్న యజమానులు బంగారం, నగదు చోరీకి గురైనట్లు గుర్తించి, ముసునూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్సై ఎంకే.బేగ్, చాట్రాయి ఎస్సై రామకృష్ణ జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి, ఆధారాలు సేకరించారు. నూజివీడు రూరల్ సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు. వేగంగా కేసు దర్యాప్తు నిర్వహించి, దొంగలను పట్టుకుంటామని తెలిపారు.
11 కాసుల బంగారం,
రూ.60 వేల నగదు అపహరణ


